12 ఏండ్ల పాటు ఉంటే ఇంటిపై హక్కు.. గ్రామకంఠం ఇండ్లకు లీగల్ ప్రాపర్టీ కార్డులు

12 ఏండ్ల పాటు ఉంటే ఇంటిపై హక్కు.. గ్రామకంఠం ఇండ్లకు లీగల్ ప్రాపర్టీ కార్డులు
  • పన్ను రసీదు, పొరుగువారి వాంగ్మూలమే కీలకం 
  • డాక్యుమెంట్ లేకున్నా.. ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ సర్టిఫికెట్లు
  • శాటిలైట్, జీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రోన్​తో డిజిటల్ సర్వే
  • పంచాయతీరాజ్, రెవెన్యూ, సర్వే శాఖల జాయింట్ ఆపరేషన్
  • ప్రభుత్వ, పోరంబోకు, దేవాదాయ భూములకు రక్షణ
  • అభ్యంతరాలకు 21 రోజుల గడువు ఇవ్వనున్న ఆఫీసర్లు
  • త్వరలో ‘స్వామిత్వ’ తరహాలో  కొత్త చట్టం అమలుకు సన్నాహా

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో దశాబ్దాలుగా ఆబాదీ( గ్రామకంఠం) స్థలాల్లో నివాసం ఉంటున్నవారికి చట్టబద్ధమైన ఆస్తి హక్కులు కల్పించేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఆబాదీ స్థలాల్లో నిరంతరాయంగా గత 12 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా నివాసముంటున్నట్లు ఆధారాలు చూపిస్తే వారికి యాజమాన్య హక్కులు కల్పించనున్నది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘స్వామిత్వ (సర్వే ఆఫ్ విలేజెస్ ఆబాది అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) స్కీమ్​’ మోడల్‌‌లో కొత్త ‘భూభారతి (ఆర్‌‌‌‌ఓఆర్)’ చట్టం ద్వారా శాశ్వత పరిష్కారం చూపబోతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యవసాయ భూముల రీసర్వేతో కలిపి ఈ ప్రక్రియ చేపట్టబోతున్నది. ఈ మేరకు సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు తాజాగా జిల్లాల కలెక్టర్లకు స్టాండర్డ్​ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) జారీ చేశారు. 

రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే శాఖల సమన్వయంతో ఊరూరా గ్రామకంఠం సరిహద్దులను నిర్ణయించి, ప్రతి ఇంటికీ డిజిటల్ కొలతలు తీసి స్పష్టమైన విస్తీర్ణంతో ఆస్తి హక్కు పత్రాలు అందించేలా కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలన్నీ కేవలం వ్యవసాయ భూముల రికార్డుల నమోదుకే పరిమితం కావడం, గ్రామకంఠాల్లోని ఇళ్లను, ఖాళీ స్థలాలను పూర్తిగా మినహాయించడంతో గ్రామీణులు తమ సొంత స్థలాలకు చట్టబద్ధమైన ఆస్తి పత్రాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరణి పోర్టల్‌లోనూ వీటి నమోదుపై స్పష్టత లేకపోవడంతో బ్యాంకులు రుణాలివ్వక, క్రయవిక్రయాలు జరపలేక సతమతం అవుతున్నారు. దీనికి పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త భూభారతి చట్టంలో ఆబాదీ భూములకు సమగ్ర హక్కుల రక్షణ కల్పించేలా ప్రత్యేక సెక్షన్లను పొందుపరిచారు. సెక్షన్ 2 పరిధిలోనే ‘ఆబాదీ’ని స్పష్టంగా నిర్వచించారు. గ్రామంలో వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగిస్తున్న ఇళ్లు, షెడ్లు, వ్యాపార సముదాయాలు, ఖాళీ స్థలాలు, ఉమ్మడి ప్రజా అవసరాల స్థలాలను ఆబాదీగా వర్గీకరించి, వాటి డిజిటల్ సరిహద్దులను చట్టబద్ధంగా రికార్డు చేయనున్నారు. 

12 ఏండ్లు ఉంటే.. ఓనర్‌‌షిప్ ఖరారు

గ్రామాల్లో దశాబ్దాలుగా ఆబాదీ స్థలాల్లో నివాసముంటున్నవారి వద్ద రిజిస్టర్డ్ దస్తావేజులు లేవు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సేల్ డీడ్లు, గిఫ్ట్ డీడ్లు, వారసత్వ పత్రాలు ఉన్నవారికి వాటి ఆధారంగా హక్కులు కల్పిస్తూనే.. ఎలాంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేని పేదలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. సదరు ఆస్తిలో నిరంతరాయంగా గత 12 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా నివాసముంటున్నట్లు ఆధారాలు చూపిస్తే వారికి యాజమాన్య హక్కులు కల్పించనున్నారు. 

ఇందుకోసం ఇంటి పన్ను రశీదులు, ఇరువైపులా ఉన్న ఇండ్ల యజమానుల వాంగ్మూలం, ఎలాంటి కోర్టు వివాదాలు లేవని పేర్కొంటూ ఇచ్చే స్వీయ ధ్రువీకరణ అఫిడవిట్ సమర్పిస్తే సరిపోతుందని ప్రభుత్వం పేర్కొంది. ఆ ఆస్తి ప్రభుత్వ నిషిద్ధ జాబితా(సెక్షన్ 22-ఏ) లేదా ప్రభుత్వ, పోరంబోకు పరిధిలోకి రాలేదని నిర్ధారించుకున్న తర్వాత ఆస్తిదారుగా ప్రకటిస్తారు. ఉమ్మడి ఆస్తుల విభజన కోరేవారు ఫారం-10 ద్వారా దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలో కొలతలు వేసి వేర్వేరుగా ప్రాపర్టీ ఐడీలను కేటాయిస్తారు. 

శాటిలైట్ మ్యాపింగ్‌తో డిజిటల్ కొలతలు

పల్లెల్లో సర్వే పనులకు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. శాటిలైట్ ఇమేజింగ్, డ్రోన్లతో సేకరించిన ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను అనుసంధానిస్తూ జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్లతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తారు. ప్రతి ఇంటిని, స్థలాన్ని కచ్చితమైన అక్షాంశ, రేఖాంశాలతో డిజిటలైజ్ చేస్తారు. ఇందుకోసం ఓపెన్ సోర్స్ క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నారు. క్షేత్రస్థాయి గ్రౌండ్ ట్రూతింగ్ సమయంలో తొలుత ప్రతి ఇంటికీ తాత్కాలికంగా ‘చల్తా నంబర్’ కేటాయించి, ఆ తర్వాత 45 కాలమ్స్ ప్రొఫార్మాలో సమగ్ర 
సమాచారాన్ని నింపుతారు. భవన నిర్మాణ విస్తీర్ణం, ఖాళీ స్థలం, రోడ్డు ముఖభాగం, సరిహద్దు కొలతలను పక్కాగా లెక్కించి శాశ్వత 'ప్రాపర్టీ పార్శిల్ నంబర్', యూనిక్ ఐడీని ఖరారు చేస్తారు. భవిష్యత్తులో ఇతరులు సెంటు స్థలాన్ని కూడా ఆక్రమించడానికి వీల్లేని విధంగా డిజిటల్ మ్యాపులను రెడీ చేయనున్నారు.  

మూడు శాఖల సమన్వయంతో సర్వే ..

సర్వే, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టనున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి సమన్వయకర్తగా వ్యవహరిస్తూ సర్వేయర్, జీపీవో, స్థానిక సిబ్బందితో కలిసి ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో అవకతవకలకు తావులేకుండా నాలుగు అంచెల క్వాలిటీ చెక్ చేయనున్నారు. గ్రామ పంచాయతీల్లో సర్వే చేసిన రికార్డుల్లో కనీసం 5 శాతం వివరాలను మండల స్థాయిలో ఈవోఆర్డీ, ఎంపీడీవో క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించనున్నారు. డివిజనల్ స్థాయిలో డీఎల్‌పీవో కనీసం 5 గ్రామ పంచాయతీలను, జిల్లా స్థాయిలో డీపీవో కనీసం10 గ్రామాల్లోని 5 శాతం రికార్డులను స్వయంగా వెరిఫై చేసి ప్రత్యేక రిజిస్టర్లలో సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు ఓవరాల్‌గా కలెక్టర్ ఇంచార్జీగా ఉంటారు. 

సర్కారు, పోరంబోకు, దేవాదాయ భూములకు రక్షణ  

స్వామిత్వ సర్వే కేవలం ప్రైవేటు ఇండ్లకే కాకుండా గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రజా ఆస్తులకు కూడా సంపూర్ణ రక్షణ కల్పిస్తుంది. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, కల్లాలు, శ్మశాన వాటికలు, ఖాళీ స్థలాలు, వీధులు, బాటలతోపాటు పోరంబోకు భూములను, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులను సర్వే బృందం ప్రత్యేకంగా గుర్తించి హద్దులు నిర్ణయిస్తుంది. దీనివల్ల ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుంది. 

అలాగే గ్రామంలోని ఆస్తుల లెక్కలు పక్కాగా తేలడంతో పంచాయతీలకు సరైన పన్నుల ఆదాయం సమకూరి, గ్రామ సమగ్రాభివృద్ధికి అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల ప్రణాళికలను సమర్థవంతంగా రూపొందించుకునేందుకు వీలు కలుగుతుంది. పంచాయతీ ఆస్తుల రిజిస్టర్ ఆధారంగా వీటిని స్థానిక సంస్థల ఆస్తులుగా 45 కాలమ్స్ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు ప్రాపర్టీ పత్రాలు ఇవ్వకుండా, ఆ వివరాలను రిజిస్ట్రేషన్ శాఖ నిషేధిత జాబితా(22-ఏ)లో చేర్చేందుకు కలెక్టర్లకు నివేదిక ఇస్తారు.

పల్లెల్లో ఆస్తి తగాదాలకు చెక్  

ఈ సర్వే ప్రక్రియ పూర్తయితే గ్రామాల్లో తరతరాలుగా కొనసాగుతున్న ఇండ్ల సరిహద్దు తగాదాలకు, కోర్టు కేసులకు శాశ్వతంగా తెరపడనుంది. ఇప్పటివరకు గ్రామకంఠంలోని ఇండ్లకు రిజిస్టర్డ్ హక్కు పత్రాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలు పొందడం, ఆస్తుల క్రయవిక్రయాలు జరపడం గ్రామీణులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. స్వామిత్వ ద్వారా ప్రతి ఇంటికీ ప్రభుత్వం అధికారిక ఆస్తిపత్రం ఇవ్వడం వల్ల గ్రామాల్లోని ఆస్తులకు చట్టబద్ధత, మార్కెట్ విలువ లభిస్తాయి. గ్రామాల్లో సమగ్ర రికార్డులు సిద్ధం కావడం వల్ల పంచాయతీల ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పన, పన్నుల వసూలు మరింత సులభతరం కానుంది. నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలతో ఈ సర్వేను పూర్తిచేయాలని అధికారులను జిల్లా కలెక్టర్లు ఆదేశిస్తున్నారు. 

నోటీసులు, అభ్యంతరాల స్వీకరణ  

సర్వే పారదర్శకంగా సాగేందుకు విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. చాటింపులు, కరపత్రాలు, గ్రామసభల తీర్మానాల అనంతరం ఫారం-1 నోటీసులను ముఖ్యమైన ప్రాంతాల్లో అతికిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం యజమానులకు ఫారం -6, 7 నోటీసులు జారీ చేస్తారు. తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ చట్టం1923 ప్రకారం ఎలాంటి వివాదం లేని ఆస్తుల యజమానులకు సెక్షన్ 9(2) కింద ఫారం-17 నోటీసులు, సరిహద్దు తగాదాలు లేదా వివాదాలు ఉన్న ఆస్తులకు సెక్షన్10(2) కింద ఫారం-18 నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసులు అందిన 21 రోజుల్లోగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మండల రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ లేదా తహసీల్దార్‌కు ఫారం-19 ద్వారా అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. అప్పీళ్ల విచారణ పూర్తయిన తర్వాతే తుది రికార్డులను లాక్ చేస్తారు.