- కీ రోల్ పోషించనున్న హైడ్రా
ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే.. - కాపిటల్ వ్యాల్యూ ప్రకారమే ట్యాక్స్ వసూలు
హైదరాబాద్ సిటీ, వెలుగు : క్యూర్ చట్టానికి సంబంధించిన గెజిట్‌ను ప్రభుత్వం అతి త్వరలోనే విడుదల చేయబోతున్నది. ఈ చట్టానికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ ఆమోదం కూడా లభించింది. రెండు మూడు రోజుల్లోపే గెజిట్ విడుదలైతే జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో ఒకేసారి కొత్త చట్టాన్ని అమలు చేయనున్నారు. కొత్త చట్టంతో మూడు కార్పొరేషన్ల పరిధిలో భవన నిర్మాణ అనుమతులు, ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సులు, పారిశుద్ధ్యం, టౌన్‌ప్లానింగ్ అన్నీ ఒకేలా ఉంటాయి.
విలీన ప్రాంతాలకు కూడా ఇవే రూల్స్వర్తిస్తాయి. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల రక్షణ, వరదల నివారణ వంటి అంశాల్లో హైడ్రా కీ రోల్పోషించనున్నది. అందుకు అనుగుణంగా ఎలా కో ఆర్డినేట్ చేసుకోవాలన్న అంశంపై మూడు కార్పొరేషన్ల అధికారులు ఇప్పటికే చర్చించుకున్నారు. కార్పొరేషన్ల వారీగా ఇప్పటికే పలుమార్లు సమవేశాలు నిర్వహించి చట్టంపై అధికారులకు అవగాహన కల్పించారు. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ తో పాటు కొన్ని అంశాలు వెంటనే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసే అవకాశం ఉంది.
విలీన ప్రాంతాల్లో తొలగనున్న చిక్కులు
ప్రస్తుతం మూడు కార్పొరేషన్లలో జీహెచ్ఎంసీ చట్టం అమలవుతోంది. అయితే, అంతకుముందు విలీనమైన శివారు మున్సిపాలిటీల్లో మున్సిపల్ చట్టం ఇంప్లిమెంట్చేస్తున్నారు. పాత జీహెచ్ఎంసీ పరిధిలో రెంటల్ వ్యాల్యూ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్వసూలు చేస్తుండగా, విలీనమైన మున్సిపాలిటీల్లో కాపిటల్ వ్యాల్యూ ఆధారంగానే ఆస్తి పన్ను తీసుకుంటున్నారు. క్యూర్ చట్టం అమల్లోకి వస్తే వేర్వేరు విధానాలు కాకుండా కాపిటల్ వ్యాల్యూ ప్రకారం పన్ను వసూలు చేయనున్నారు. దీంతో పాటు ఇతర మార్పులు కూడా ఉన్నాయి.
అధికారుల కసరత్తు పూర్తి
క్యూర్ చట్టం అమలుకు ముందే మూడు కార్పొరేషన్ల అధికారులు కొత్త నిబంధనలపై అధ్యయనం చేశారు. చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే ఎలాంటి అయోమయం లేకుండా సంబంధిత విభాగాలు పనిచేసేలా అంతర్గతంగా మార్పులు చేసుకుంటున్నారు. గెజిట్ వెలువడిన తర్వాత తుది మార్గదర్శకాలు, విధివిధానాలను అనుసరించి క్షేత్రస్థాయిలో చర్యలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఇప్పటివరకు విలీన ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక విధానాలకు బదులుగా, మూడు కార్పొరేషన్ల పరిధిలో ఒకే చట్టం.. ఒకే విధానం అమల్లోకి రానుంది.
