- అప్పటి నుంచి తండ్రి ఎదురుచూపులు
- పొలం, ఆస్తి కోసం కన్నేసిన ఓ వ్యక్తి
- మోసగాడిని తీసుకొచ్చి కొడుకంటూ పరిచయం
- దఫదఫాలుగా పైసలు గుంజిన వ్యక్తులు
- డీఎన్ఏ టెస్ట్ చేస్తామనడంతో బట్టబయలైన నిజం
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఆయన పేరు లక్ష్మారెడ్డి.. ఐదుగురు బిడ్డల తర్వాత కొడుకు పుట్టడంతో అతడిని అల్లారుముద్దుగా చూసుకున్నాడు. అది 2002వ సంవత్సరం.. ఆ పిల్లవాడు టెన్త్‌క్లాస్‌లో ఫెయిల్‌కావడంతో ‘బాగా సదువుతవనుకుంటే ఫెయిలై పరుపు తీసినవ్ కదరా కొడుకా’ అని తండ్రి మందలించాడు. దీనికి నొచ్చుకున్న ఆ పిల్లవాడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి లక్ష్మారెడ్డి కొడుకు కోసం వెతకని ఊరు లేదు.. తిరగని చోటు లేదు.అయితే, కొద్ది రోజుల కింద లక్ష్మారెడ్డి కొడుకు కోసం ఎంతగా అల్లాడిపోతున్నాడో తెలుసుకున్న ఓ వ్యక్తి కపట నాటకానికి తెర తీశాడు. అతడి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్‌వేసి దొంగ వారసుడిని పరిచయం చేశాడు. తన జీవితపు చివరి అంకంలోనైనా తన కొడుకు తిరిగివచ్చాడని సంతోషపడుతున్న ఆ తండ్రికి తర్వాత చేదు నిజం తెలిసింది. అతడు తన కొడుకు కాదని.. మోసగాడని తెలిసి మళ్లీ కొడుకు కోసం వేట మొదలుపెట్టాడు.
‘కొట్టిపారేస్తరు’ కంప్లయింట్ వద్దు
ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేట్ కు చెందిన పిషాటి లక్ష్మారెడ్డి, రాములమ్మ దంపతులకు ఐదుగురు కూతుళ్లు. తర్వాత కొడుకు శ్రీనివాస్ రెడ్డి పుట్టాడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. 24 ఏండ్ల క్రితం10వ తరగతి ఫెయిల్‌కాగా తండ్రి మందలించాడు. దీంతో శ్రీనివాస్‌రెడ్డి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ఇవ్వడానికి వెళ్లగా అప్పటి పోలీస్అధికారి వారించాడు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉందని, అందులో గనక చేరి ఉంటే ‘కొట్టిపారేస్తరు’ అని చెప్పాడు. దీంతో తన కొడుకు ఎక్కడున్నా బతికి ఉంటే చాలని లక్ష్మారెడ్డి ఫిర్యాదు చేయకుండానే తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి తనొక్కడే కొడుకును వెతుకుతున్నాడు.
లక్ష్మారెడ్డి.. నీ వారసుడొచ్చాడు..
సెప్టెంబర్16న లక్ష్మారెడ్డికి బంధువుల ద్వారా మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. లక్ష్మారెడ్డికి దాదాపు 8 ఎకరాల భూమి ఉంది. దీంతో ఆ ఆస్తిపై కన్నేసిన పెద్దగూడానికి చెందిన మోహన్‌రెడ్డి మాయమాటలతో దగ్గరయ్యాడు. ఒకానొక సందర్భంలో లక్ష్మారెడ్డితో ‘ నీ కొడుకు చెరువుగట్టు టెంపుల్దగ్గర ఉన్నడు.వస్తే చూపిస్తా’ అని నమ్మబలికాడు. సెప్టెంబర్ 20న లక్ష్మారెడ్డి సడ్డకుడి కొడుకుని చెరువుగట్టుకు తీసుకువెళ్లి సాధువు వేషంలో..మాల వేసుకుని ఉన్న యాదయ్య అనే వ్యక్తిని చూపించాడు. ఏం పేరు అని అడిగితే శ్రీనివాస్‌రెడ్డి అని సమాధానం చెప్పాడు. దీంతో అతడు ‘మీ నాన్నతో మాట్లాడు బాబు’ అని లక్ష్మారెడ్డితో ఫోన్లో మాట్లాడించాడు. లేక లేక కలిగిన సంతానం 24 ఏండ్ల తర్వాత తనతో మాట్లాడుతున్నాడని లక్ష్మారెడ్డి ఎంతో సంతోషపడ్డాడు. వెంటనే ఇంటికి రా కొడుకా అని పిలిచాడు. మోహన్‌రెడ్డితో కలిసి వస్తానని సమాధానం ఇచ్చాడు.
కొడుకా.. కోడలు, మనవరాళ్లతో కలిసే రా..
సెప్టెంబర్ 22న మోహన్ రెడ్డి లక్ష్మారెడ్డి ఇంటికి వచ్చి ‘శ్రీనివాస్‌రెడ్డి మాల వేసుకుని ఉన్నడు.. అది తీయించాలె.. సమ్మక్క సారక్క దగ్గరికి తీస్కపోవాలె.. నీ కొడుకును మొత్తం మార్చేసిన్రు.. మేడారంల రూ.40 లక్షలు ఖర్చయితయి.. కక్క పోపియ్యాలె’ అని అడిగాడు. దీనికి కూడా లక్ష్మారెడ్డి ఒప్పుకున్నాడు. తన కొడుకుతో మాట్లాడాలని ఉందని అడిగితే ఫోన్ కలిపి ఇచ్చాడు. అప్పుడు యాదయ్య అలియాస్శ్రీనివాస్రెడ్డి ‘నాన్న నాకు ఇంటికి రావాలని ఉంది. పెండ్లయి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నరు. అందరినీ తీస్కరావాల్నా ’ అని అడిగాడు. దీనికి లక్ష్మారెడ్డి ‘కొడుకా.. నువ్వు నా కోడలు..మనవరాళ్లతో కలిసే రా.. మీకోసం ఎదురుసూస్తున్నం బిడ్డా..’ అని బదులిచ్చాడు.
పైసలు గుంజుతనే ఉన్నరు
కొద్ది రోజులకు ఫోన్ చేసిన యాదయ్య తన కూతురు ఆరోగ్యం బాగాలేదని రూ. 10 వేలు తీసుకున్నాడు. తాను ఖమ్మం జిల్లా తల్లాడలో ఉంటా అని ఒకసారి..మధిరలో ఉంటానని మరోసారి చెప్పాడు. ‘నా పిల్లలను సదివిస్తవా? మా అందరిని సూస్కుంటవా’ అని అడుగుతూ ఉండేవాడు. కావాల్సినప్పుడల్లా డబ్బులు తీసుకునేవాడు. దీనిపై లక్ష్మారెడ్డి కూతుర్లు, అల్లుళ్ళకు అనుమానం వచ్చింది. ఎంత సేపు డబ్బులు లాగేందుకే యత్నిస్తుండడంతో సెప్టెంబర్ 27న సాయంత్రం ఇబ్రహీంపట్నంలోని భరత్ గార్డెన్స్ వద్దకు రమ్మన్నారు. సాధువు వేషంలో ఉన్న యాదయ్య అక్కడికి రావడంతో ‘డీఎన్ఏ టెస్ట్చేయిస్తాం..అందులో అసలు విషయం బయటపడుతుంది’ అని గట్టిగా నిలదీయడంతో భయపడి తాను ఎవరో చెప్పేశాడు. మోహన్ రెడ్డి చెప్పినందు వల్లే డబ్బుల కోసం కొడుకులా నటించానని చెప్పాడు. తనది నల్గొండ జిల్లా నకిరేకల్ అని సమాధానమిచ్చాడు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మహేందర్ రెడ్డి
తెలిపారు .
