- నల్గొండ, వరంగల్ జిల్లాల్లో గుర్తించిన జెడ్ఎస్ఐ శాస్త్రవేత్తల బృందం
- ఆరుకు చేరిన ప్రత్యేక ఎండమిక్ సరీసృపాల సంఖ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సరికొత్తగా రెండు బల్లి జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్ఎస్ఐ) హైదరాబాద్ ఫ్రెష్ వాటర్ బయాలజీ రీజినల్ సెంటర్, కోల్‌కతా జెడ్ఎస్ఐ, నెహ్రూ జూలాజికల్ పార్క్, డెహ్రాడూన్‌కు చెందిన వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఒడిశా ఫకీర్ మోహన్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరిశోధనల్లో ఈ కొత్త జీవులు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఆవిష్కరణకు సంబంధించిన సమగ్ర పరిశోధనా వ్యాసం అంతర్జాతీయ వర్గీకరణ శాస్త్ర జర్నల్ యూరోపియన్ జర్నల్ ఆఫ్ టాక్సానమీలో బుధవారం ప్రచురితమైంది. పరిశోధకులు భరత్ భూపతి, సుమిధ్ రాయ్, బి.లక్ష్మీనారాయణ, అమృతా బాలన్, దీపా జైస్వాల్, ప్రత్యూష్ పి.మహాపాత్రల బృందం వీటికి హెమిడాక్టిలస్ కేర్నికోలా, హెమిడాక్టిలస్ కోయాయోరం అని నామకరణం చేశారు.
ప్రస్తుతం దేశంలో మొత్తం 62 హెమిడాక్టిలస్ జాతులు ఉండగా.. తాజాగా వెలుగుచూసిన ఈ రెండూ హెమిడాక్టిలస్ బ్రూకీ గ్రూపులోని ముర్రాయి క్లేడ్‌కు చెందినవని తేలింది. తాజా ఆవిష్కరణలతో తెలంగాణ భౌగోళిక ప్రాంతానికే ప్రత్యేకంగా పరిమితమైన(ఎండమిక్) సరీసృపాల సంఖ్య ఆరుకు చేరింది.
గతంలో గుర్తించిన హెమిడాక్టిలస్ ఈములస్, హెమిడాక్టిలస్ ఫ్లావికాడస్, హెమిడాక్టిలస్ జెరికోలస్, హెమిడాక్టిలస్ ట్రాయిట్లరిల సరసన ఇప్పుడు కేర్నికోలా, కోయాయోరం వచ్చి చేరాయి. సేకరించిన నమూనాలను కోల్‌కతాలోని జెడ్ఎస్ఐ ప్రధాన కార్యాలయం, హైదరాబాద్‌లోని ఎఫ్‌బీఆర్‌సీ-జెడ్ఎస్ఐ మ్యూజియంలలో భద్రపరిచారు.
రాతి కుప్పల్లో కేర్నికోలా జీవనం..
నల్గొండ జిల్లా వర్ధమానిగూడెం బస్టాప్ సమీపంలోని గుంటు మడుగు, పెద్దవాగు–పెండ్లిపాకాల రిజర్వాయర్ల మధ్య గల రాతి ప్రాంతంలో ‘హెమిడాక్టిలస్ కేర్నికోలా’ను గుర్తించారు. చేలగట్లు, గుట్టల వద్ద మనుషులు పేర్చిన రాతి కుప్పల(స్టోన్ కేర్న్స్) సందుల్లో ఇవి ఎక్కువగా నివసిస్తుండటంతో వీటికి ‘కేర్నికోలా’ అని పేరు పెట్టారు. ఇవి గరిష్టంగా 49 మిల్లీమీటర్ల పొడవు పెరుగుతాయి. నల్లటి రాళ్లపై శత్రువులకు చిక్కకుండా కలిసిపోయే రంగును కలిగి ఉంటాయి. వీపుపై 13 నుంచి 15 వరుసల్లో కోణాకార పొలుసులు, పొట్టపై 31 నుంచి 32 వరుసల పొలుసులుంటాయి. లంబాడా తండాలు, పల్లెల ముళ్లపొదల్లో తిరిగే ఇవి.. చలి, వర్షాకాలాల్లో పగటిపూట రాళ్లపై సేదదీరుతూ, రాత్రివేళల్లో పురుగులను వేటాడుతాయి.
వరంగల్‌లో ‘కోయాయోరం’..
వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పాకాల వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలో రెండో జాతి అయిన ‘హెమిడాక్టిలస్ కోయాయోరం’ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అడవుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న స్థానిక కోయ గిరిజన తెగ జీవనశైలిని గౌరవిస్తూ దీనికి ‘కోయాయోరం’ అని లాటిన్ బహువచనంలో పేరు పెట్టారు. పాకాల నేచర్ ట్రైల్, హరిత రిసార్ట్స్ పరిసరాల్లోని ఎర్రనేలలు, బండరాళ్ల కింద వీటిని సేకరించారు.
గరిష్టంగా 55.6 మి.మీ. వరకు పెరుగుతాయి. బూడిద రంగు వీపుపై స్పష్టమైన నాలుగు తెల్లటి పూల ఆకారపు గుర్తులు, వాటి చుట్టూ ముదురు రంగు అంచులు ఉండటం దీని ప్రత్యేకత. తల వెనుక ఎగుడుదిగుడు గడ్డలు లేకుండా నునుపైన పొలుసులుంటాయి.
ఏమాత్రం చప్పుడు వచ్చినా పాము మాదిరిగా ఒడుపుగా, అత్యంత వేగంగా గడ్డిదుబ్బుల్లోకి దూసుకెళ్లడం వీటి నైజం. హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా కనిపించే ‘హెమిడాక్టిలస్ ట్రాయిట్లరి’ జాతికి ఈ రెండు కొత్త జాతులు దగ్గరి పోలికలు కలిగి ఉన్నప్పటికీ.. మైటోకాండ్రియల్ ఎన్డీ2 జన్యు క్రమ విశ్లేషణ, మార్ఫాలజీ పరిశీలనల్లో ఇవి పూర్తిగా స్వతంత్ర జీవులని తేలింది.
