వెలుగు స్పెషల్: ప్రయోజనాత్మక ఏఐ.. దుష్టశక్తుల చేతుల్లో పావుగా మారుతోందా?

వెలుగు స్పెషల్: ప్రయోజనాత్మక ఏఐ..  దుష్టశక్తుల చేతుల్లో పావుగా మారుతోందా?

స్మార్ట్ ఫోన్,  లాప్‌‌టాపుల్లో  సామాన్య ప్రజానీకం వాడే  ఏఐ టూల్స్ ఏఐ  ఓవర్‌‌ వ్యూ, ఏఐ మోడ్, చాట్‌‌జిపిటి, జెమినై అనే కృత్రిమ మేధ టూల్స్‌‌ ప్రస్తుత ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందాయి.  గూగుల్‌‌లో వెతికేటప్పుడు పైన వచ్చే సారాంశం ఏఐ ఓవర్‌‌వ్యూ.  వేరే యాప్‌‌లలో వాడే ఆప్షన్ ఏఐ మోడ్,   నేరుగా మాట్లాడి పనులు చేయించుకోవడానికి ఉపయోగపడే స్వతంత్ర చాట్‌‌బాట్‌‌లు గూగుల్ వారి 'జెమినై',  ఓపెన్ ఏఐ వారి 'చాట్‌‌జిపిటి'. సాంకేతికత అనేది ఒక కత్తి లాంటిది.  దాన్ని ఎలా వాడుతున్నారనే దానిపైనే దాని ఫలితం ఆధారపడి ఉంటుంది.  

ఏఐ అభివృద్ధి చెందడానికి కావలసిన ప్రధాన ముడిసరుకు టన్నులకొద్దీ డేటా. అందుకోసం లక్షల సంఖ్యలో పుస్తకాలు, వ్యాసాలు, పరిశోధనా పత్రాలు,  వెబ్‌‌సైట్లు, సాంకేతిక సమూహాలు, సాహిత్యం కావాలి.  కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న డేటాను తవ్వి తీసి యథేచ్ఛగా  వాడుకోవడం జరిగింది.  ఏఐ ప్రారంభ దశలో కేవలం ప్రశ్నలకు సమాధానమిచ్చే ఒక చాట్‌‌బాట్ గా ఉండేది. కాలక్రమేణా సాంకేతిక సంస్థలు ఏఐకి మరింత శక్తిని సమకూరుస్తూ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కట్టబెట్టాయి.   ఒక పనిని చేయమని ఆదేశిస్తే దాన్ని పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను ఏఐకి కల్పించారు. 

లాభార్జనే ధ్యేయంగా కంపెనీలు

వ్యక్తుల అనుమతి అవసరం లేకుండానే పని పూర్తయితే చాలు అనే రీతిలో సిస్టమ్‌‌లను డిజైన్ చేయడమే కొంప ముంచుతున్నట్లు అనిపిస్తున్నది.  సురక్షితమైన నియంత్రణ వ్యవస్థను రూపొందించకుండా ఒక యంత్రానికి దాని లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన సౌకర్యాలు, స్వేచ్ఛ ఇవ్వడం వలన అది దాని ఇష్ట ప్రకారం దానికి అనుకూలమైన,  
సులభమైన,  అడ్డదారి మార్గాలను సైతం ఎంచుకునే అవకాశం ఉంటుంది. అవసరమైతే  ఫైర్ వాల్స్‌‌ని ఛేదించి పాస్‌‌వర్డ్ లను  అతిక్రమించి తన పని తాను చేసుకుపోతుంది. లాభార్జనే  ధ్యేయంగా పనిచేసే కొన్ని కంపెనీలు  భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కి  మార్కెట్లోకి  పోటాపోటీగా తమ ఉత్పత్తులను విడుదల చేస్తూ, లోపాలకు, పొరపాట్లు అవకాశం కల్పిస్తున్నారు.  ఇటువంటి లోపాల ఫలితంగా ప్రయోజనాత్మకమైన ఏఐ ప్రస్తుత కాలంలో దుర్వినియోగం జరుగుతోందన్న ఆందోళన జనాల్లో పెరుగుతోంది.  

సైబర్‌‌‌‌ దాడులు, ఆర్థిక మోసాలు

దుష్టశక్తులు జెనరేటివ్ ఏఐ సాధనాలను దుర్వినియోగం చేస్తున్న మార్గాలకు సంబంధించిన వార్తలు కలిచివేస్తున్నాయి. సైబర్ దాడుల వాడకానికి, ఆర్థికపరమైన మోసాలకు, సామూహిక మోసాల కోసం, ప్రభుత్వాలను  భ్రష్టు పట్టించడానికి, నమ్మశక్యమైన డీప్‌‌ఫేక్‌‌లను సృష్టించడానికి ఈ రోజుల్లో కృత్రిమ మేధను తరచుగా దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు భాషా నమూనాలను ఉపయోగించి, తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో అత్యంత వాస్తవంగా కనబడే స్పియర్- ఫిషింగ్ ఇమెయిళ్లను పంపుతారు.  

సాంకేతిక  నైపుణ్యం ఉన్న వ్యక్తులు, ప్రామాణిక భద్రతా రక్షణలను అధిగమించే మాల్వేర్ లేదా రాన్సమ్‌‌వేర్‌‌ను రూపొందించడానికి ఏఐ కోడింగ్ సహాయకులను ఉపయోగించుకుంటున్నారు.  కార్పొరేట్ అధికారుల లేదా కుటుంబ సభ్యుల ముఖాలు, గొంతులు అనుకరించడానికి మోసగాళ్లు రియల్-టైమ్  డీప్‌‌ఫేక్ ఆడియో,  వీడియోను ఉపయోగిస్తారు.  తద్వారా వారిని అనధికారిక డబ్బు బదిలీలకు లేదా దోపిడీ పథకాలకు వాడుకుంటారు. 

నకిలీ ఖాతాలు

సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు,  సమీక్షలు,  వ్యాఖ్యలను  సృష్టించి, కృత్రిమంగా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి లేదా కల్పిత  రాజకీయ కథనాలను సృష్టించడానికి ప్రయత్నిస్తారు.  ప్రజా ప్రముఖులను అప్రతిష్టపాలు చేయడానికి, ఎన్నికల సమగ్రతను తారుమారు చేయడానికి,  చట్టబద్ధమైన వార్తా మూలాలపై నమ్మకాన్ని దెబ్బతీయడానికి, నిజమైనవిగా  కనిపించే నకిలీ చిత్రాలు,  వీడియోలు,  వాయిస్ క్లిప్‌‌లను ఉపయోగిస్తారు. ఈ విధంగా కృత్రిమ మేధ  ప్రస్తుతం అనేక రంగాలలో దుర్వినియోగం అవుతోంది. ఏఐకి ఉండవలసిన పరిమితులను, నియమ నిబంధనలను నిర్ణయించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏఐతో కలిగే దుష్పరిణామాలను, విపత్కర పరిస్థితులను గమనిస్తున్న సామాన్యులు, మేధావులు, విద్యావేత్తలు, నైతికశాస్త్ర నిపుణులు మౌనంగా ఉండకూడదు. 

ఆధునిక సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ అవసరం

 తమ గోప్యతకూ, హక్కులకూ భంగం వాటిల్లినప్పుడు గొంతు విప్పాలి. 'మా డేటాను, గోప్యతను ఎలా రక్షిస్తారు? ఉద్యోగ భద్రతకు ఎలాంటి హామీ ఉంటుంది?  ఏఐని నియంత్రించే చట్టాల మాటేమిటి? అని ప్రభుత్వాలను నిలదీయాలి.  అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ అంశాలపై ప్రభుత్వాలు సాంకేతిక రంగానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలవాలి.  ఏఐతో  కలిగే  దుష్పరిణామాలను విశ్లేషించి చట్టపరమైన,  నైతికపరమైన నియంత్రణలను రూపొందించాలి.  సంప్రదాయ పద్ధతులతో  వేగంగా అభివృద్ధి చెందుతున్న వైరస్‌‌లను, డీప్‌‌ఫేక్‌‌లను  గుర్తించడం కష్టం.  కేవలం ఏఐ ముప్పులను గుర్తించే స్థాయి నుంచి, వాటిని ముందే ఊహించి అడ్డుకునే స్థాయికి ఆధునిక సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ మారాలి. ఈ మధ్య 'ఓపెన్ ఏఐ' సంస్థ తన సరికొత్త మోడళ్ల అభివృద్ధికి సంబంధించిన శిక్షణ,  అంతర్గత పరీక్షల నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా తమ అధునాతన ఏఐ మోడళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది.  

ఏఐ మానవాళికి ఉపయోగకరంగా మారాలి

అక్టోబర్‌‌లో విడుదల కావాల్సిన 'జీపీటీ-6 ఆస్ట్రా' మోడల్‌‌ను  పరీక్షిస్తే అది వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం,  మానవ పర్యవేక్షణ లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి లోపాలను చూపించింది. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో ఈ మోడల్ విడుదలను గూగుల్ సంస్థ నిలిపివేయడం శుభ పరిణామం.  ఏతావాతా మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఏఐ అనేది స్వతంత్రంగా ఆలోచిస్తూ ఈర్ష్యాద్వేషాలతో,  కపట బుద్ధితో పనులుచేసే వ్యవస్థ కాదు. అది మనిషి అందించిన డేటా అనే అద్దంలో ప్రతిబింబించే ప్రతిరూపం మాత్రమే.  మనం దానికి ఎలాంటి సమాచారం ఇచ్చామో అదే ఫలితాన్ని తిరిగి ఇస్తుంది. ఇప్పటికైనా సామాజిక బాధ్యతతో,  మేధావుల మార్గదర్శకత్వంలో,  ప్రభుత్వ సానుకూల చర్యలతో  ఏఐ మానవాళికి ఉపయోగకరంగా మారాలని ఆశిద్దాం. 

- ఆర్ సి కుమార్, సోషల్​ యాక్టివిస్ట్​