సైఫాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం డిమాండ్ చేసింది. సాంస్కృతిక సారథిలో 1,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరింది.
బుధవారం గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కళాకారులు ఆందోళన చేపట్టారు. సంఘం రాష్ట్ర చైర్మన్ అన్వోజు వెంకటేశం మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కళాకారులను పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న కొంతమందికి మాత్రమే సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉద్యమ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలన్నారు.
అనంతరం రవీంద్రభారతి ముట్టడికి యత్నించిన పలువురు కళాకారులను పోలీసులు అరెస్ట్‌చేసి, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నకిరేకంటి కిరణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పేరాల యాదగిరి, ఉపాధ్యక్షులు కొండ్ర కుమార్, మట్టెడ కవిత పాల్గొన్నారు.
