- రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బీమా
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర సర్కారు గుడ్న్యూస్ అందించింది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు గాయపడినా.. ప్రాణాలు కోల్పోయినా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డి.దివ్య ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పనిచేస్తున్న 52,145 మంది మల్టీపర్పస్ వర్కర్లకు ఈ బీమా వర్తించనుంది. గ్రామాల్లో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు, ప్లాంటేషన్ పనులతో పాటు ఇతర పంచాయతీ పనులను మల్టీపర్పస్ వర్కర్లు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా విద్యుదాఘాతాలు, రోడ్డు ప్రమాదాలు వంటి ఘటనల్లో పలువురు గాయపడటం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు సిద్దిపేట, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల అధికారులు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించింది.
కార్మికులపై పైసా భారం లేదు..
బీమా కోసం కార్మికులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. వార్షిక ప్రీమియాన్ని సంబంధిత గ్రామ పంచాయతీల జనరల్ ఫండ్స్ నుంచి చెల్లించాలని కమిషనర్ ఆదేశించారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అందించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ప్రభుత్వం పరిశీలనకు సూచించింది.
గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి, అవసరాలను బట్టి రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.15 లక్షల పాలసీల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. పంచాయతీల వారీగా పాలసీ ఎంపిక, ప్రీమియం చెల్లింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డీపీవోలను కమిషనర్ ఆదేశించారు. ఈ నెల 10లోగా పూర్తి వివరాలతో నివేదిక పంపాలని స్పష్టం చేశారు.
