- వివరణ ఇచ్చేందుకు కౌశిక్‌రెడ్డికి వారం రోజుల గడువు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం మరోసారి వాయిదాపడింది. శాసనసభ కమిటీ హాల్ లో బుధవారం చైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్‌కు కమిటీ సభ్యులు పద్మారావు, కూనంనేని సాంబశివరావు, రాకేశ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీనియర్ సభ్యుడైన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై, ఆయనపై చర్యల కోసం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎథిక్స్ కమిటీకి నివేదిక పంపించారు.
దీనిపై వివరణ ఇవ్వాలని ఎథిక్స్ కమిటీ కౌశిక్ రెడ్డికి నోటీసులు పంపించగా, ఆయన దానికి వివరణ ఇవ్వకుండా నాలుగు వారాల గడువు కోరుతూ వస్తున్నారు. ఈ సమావేశంలోనూ కౌశిక్‌పై చర్యల కోసం చర్చిస్తుండగా కనీసం వారం రోజుల గడువు అయినా ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యుడు పద్మారావు విజ్ఞప్తి చేశారు. దీంతో అక్టోబర్ 8న మళ్లీ సమావేశమై ఆయన వివరణపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.
