హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర.. రాముడిని బీజేపీకి పరిమితం చేసినందుకు థ్యాంక్స్: బండి సంజయ్

హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర.. రాముడిని బీజేపీకి పరిమితం చేసినందుకు థ్యాంక్స్: బండి సంజయ్
  • సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలి
  • సంఘ్ పరివార్ లేని భారతదేశాన్ని ఊహించలేం
  • కాంగ్రెస్ రహిత దేశాన్ని జనం చూడాలనుకుంటున్రు
  • ఎన్నికల వరకే రాజకీయాలు.. తర్వాత అభివృద్ధే
  • కరీంనగర్​లో కేంద్ర మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ దేశాన్ని చీలుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. హిందూ సమాజాన్ని చీల్చాలని కుట్ర చేస్తోందని ఆయన అన్నారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. దేశమంతా హరహర మహాదేవ్ అని మార్మోగుతోందని, మోదీ ప్రాతినిధ్యం వహిస్తోంది వారణాసి నుంచేనన్నారు. 

రాముడిని బీజేపీకే పరిమితం చేసినందుకు సీఎంకు థ్యాంక్స్ చెప్పాలేమోనని ఆయన ఎద్దేవా చేశారు. దేవుళ్లను విభజిస్తున్న సీఎంను చూసి కాంగ్రెస్ నేతలే అసహ్యించుకుంటున్నారని, ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. రాముడు, శివుడి పేరుతో దైవాన్ని చీల్చాలనుకుంటే హిందూ సమాజం తిరగబడుతుందని హెచ్చరించారు. ‘ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధి పైనే దృష్టి సారించాలి’ అనే ప్రధాని మోదీ ఆలోచననే తాము పాటిస్తామని తెలిపారు.

సంఘ్ పరివార్ లేని భారత్ ను ప్రపంచమే ఊహించుకునే స్థితిలో  లేదని,  కాంగ్రెస్ లేని భారత్ ను చూడాలని దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే  దేశమంతా విస్తరించిన కాంగ్రెస్ ఇప్పుడు 3, 4 రాష్ట్రాలకే పరిమితమైందన్నారు. సంఘ్ పరివార్ నీడ లేని సిలబస్ రూపొందించాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలను ఆదేశించడం విడ్డూరమన్నారు. 

రూ.840 కోట్ల  అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) నిధులతో చేపట్టిన అనేక పనులకు సీఎం శంకుస్థాపన చేశారన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ​ అని, బీజేపీకి సంబంధమేముందని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ వ్యవస్థపై విష ప్రచారం చేసి భ్రష్టు  పట్టించాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. ఈ నెల 4న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరీంనగర్ ప్రతిమ మెడికల్ కళాశాల కార్యక్రమంతోపాటు మెదక్ జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో  పాల్గొంటారని సంజయ్ తెలిపారు.