గోధుమలకు రూ. 25 పెంపు.. రూ.2,610కు చేరిన ఎంఎస్పీ
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోదం
గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్3కి కూడా ఆమోదం తెలిపిన కేబినెట్
న్యూఢిల్లీ: రబీ సీజన్(2027–28 మార్కెటింగ్ సీజన్)లో 6 పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)లను కేంద్ర కేబినెట్ పెంచింది. అత్యధికంగా కుసుమ పంటకు క్వింటాల్‌కు రూ.675 మేర మద్దతు ధర పెరిగింది. ఆ తర్వాత రాప్‌సీడ్, ఆవాలకు క్వింటాల్‌కు రూ.413 చొప్పున పెరిగింది. గోధుమ కనీస మద్దతు ధరను రూ.25 మేరకు పెంచగా.. క్వింటాల్ ఎంఎస్పీ రూ.2,610కు చేరింది.
బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ‘ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ)’ ఆయా పంటలకు ఎంఎస్పీలను పెంచుతూ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ‘‘బార్లీ మద్దతు ధరను రూ. 136 పెంచగా.. క్వింటాల్ ఎంఎస్పీ రూ. 2,286కు చేరింది. శనగ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,875 నుంచి రూ.83 పెరిగి రూ.5,958కి చేరింది. అలాగే ఎర్ర కందిపప్పు (మసూర్) మద్దతు ధర రూ.390 పెరిగి రూ.7,390కి చేరింది. ఆవాల మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,200 నుంచి రూ.413 పెరిగి రూ.6,613కి చేరింది. కుసుమ రేటు గతేడాది క్వింటాల్‌కు రూ.6,540గా ఉండగా.. రూ.675 పెరిగి రూ.7,215కి చేరింది” అని కేంద్ర మంత్రి వివరించారు.
ఢిల్లీకి ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్
దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ నిర్వహణ మెరుగుదల కోసం ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్) ప్రాజెక్టుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రియల్ టైమ్ ట్రాఫిక్ డేటా, ఏఐ అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్, ఆటోమేటెడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ కమాండ్- అండ్- కంట్రోల్ సిస్టమ్ ద్వారా రోడ్డు నెట్‌వర్క్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా రూ. 1,789.52 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్టు తెలిపారు.
గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్3కీ ఆమోదం
పునరుత్పాదక విద్యుత్‌ను సమర్థంగా తరలించేందుకు ఉద్దేశించిన ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్- ఫేజ్-3’ పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. రూ.1,86,405 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ స్కీం ద్వారా రాష్ట్రాల పరిధిలో విద్యుత్ సప్లై వ్యవస్థను బలోపేతంచేసి135 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను తరలించే సామర్థ్యం కల్పించనున్నట్టు చెప్పారు.
