హైదరాబాద్, వెలుగు: పీఎం ఆవాస్ యోజన(రూరల్) పథకం అమలుపై తెలంగాణ హౌసింగ్ అధికారులు ఇతర రాష్ట్రాల్లో సర్వే చేస్తున్నారు. మొత్తం ఐదు బృందాలతో ఉన్నతాధికారులను వివిధ రాష్ట్రాలకు ప్రభుత్వం పంపింది. ఆయా రాష్ట్రాల్లో పీఎం అవాస్ యోజన రూరల్ పథకం కింద ఇళ్లను ఎలా నిర్మిస్తున్నారు, ఎంత ఖర్చవుతోంది, అక్కడి లబ్ధిదారులు, అధికారుల అభిప్రాయాలను తెలంగాణ హౌసింగ్ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటనలు పూర్తిచేసిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ చైతన్యకుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఈశ్వరయ్య, బలరాంతో పాటు జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు హితోబా, తిరుపతిరెడ్డి పర్యటన బృందంలో ఉన్నారు.
తెలంగాణకు 2 లక్షల ఇండ్లు..
పదేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పీఎం ఆవాస్ యోజన(రూరల్) పథకం కింద ఇటీవల 2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి రూరల్‌లో రూ.72 వేలతో పాటు టాయిలెట్ల నిర్మాణానికి, వీబీజీ రామ్ జీ పథకం కింద సుమారు రూ.30 వేల అదనంగా అందిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తోంది. ఇందులో కేంద్రం నుంచి రూ.లక్ష రానుండగా.. మిగతా రూ.4 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.
