దినేష్ తేజ్, దష్విక.కె జంటగా అర్జున్ కోలా తెరకెక్కించిన చిత్రం ‘తత్వం’. శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటి నిర్మించారు. అక్టోబర్ 2న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు అర్జున్ కోలా మాట్లాడుతూ ‘మర్డర్ మిస్టరీ జానర్‌లో ఉత్కంఠ రేపే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను థ్రిల్ కలిగించేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. ‘తత్వం’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఉంది. మర్డర్ మిస్టరీ వెనుక నిజాలు, అబద్ధాలు ఉంటాయి. ఓ మనిషి ఏది నమ్మాలి.. ఏది నమ్మకూడదో అనే సందిగ్ధంలో జరిగే కథ ఇది.
ఏది నిజమో, ఏది అబద్ధమో తెలిసినప్పుడు ఓ మనిషి తత్వం బయటపడుతుంది. క్యారెక్టర్స్ సైకాలజీతో పాటు హీరో పాత్ర చివరిలో ఎలా మారిందనే దానిపై కూడా ఈ టైటిల్ ముడిపడి ఉంది. దినేష్ తేజ్, దష్విక చాలా బాగా నటించారు. చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ఎస్సెట్. సెకండాఫ్‌లో వచ్చే మిస్టరీ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా తర్వాత ‘మాల్గుడి డేస్’ తరహాలో ద్వారపూడి డేస్ పేరుతో గోదావరి నేపథ్యంలో ఓ ఎమోషనల్ మూవీకి ప్లాన్ చేస్తున్నా’ అని చెప్పాడు.
