- రెండేళ్లలో రూ.455 కోట్లు రికవరీ
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంలో సైబర్ బాధితులు కోల్పోతున్న మొత్తంలో దాదాపు 60 శాతం స్టాక్ ట్రేడింగ్, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలవేనని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ అన్నారు. హైదరాబాద్ ప్రీమియం నాలెడ్జ్ ఫోరం ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని హోటల్ అవాసాలో బుధవారం కన్వెన్షన్ ఆన్ సైబర్ సెక్యూరిటీ వెన్ ట్రస్ట్ బికమ్స్ ద వెపన్ పేరుతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వియత్నాం, మయన్మార్, కంబోడియా వంటి దేశాల నుంచి అంతర్జాతీయ ముఠాలు అధునాతన కాల్ సెంటర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నాయని తెలిపారు. గత రెండేళ్లలో సైబర్ బాధితులు పోగొట్టుకున్న రూ. 455 కోట్లను పోలీసులు రికవరీ చేశారని పేర్కొన్నారు. ప్రజలు స్టాప్, థింక్, వెరిఫై అనే సూత్రాలను పాటించాలని సూచించారు.
సుప్రీంకోర్టు న్యాయవాది, సైబర్ లా నిపుణుడు డా.పవన్ దుగ్గల్ మాట్లాడుతూ.. ప్రతీ చిన్న విషయానికి ఏఐపై గుడ్డిగా ఆధారపడితే క్రమంగా మానవ మేధస్సు క్షీణిస్తుందని తెలిపారు. అనంతరం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన ప్రత్యేక అవేర్‌నెస్ వీడియోలను ఆవిష్కరించారు. సైబర్ సెక్యూరిటీ అండ్ క్రిటికల్ టెక్నాలజీస్ అడ్వైజర్ డాక్టర్ దేవేశ్వత్స, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు జితెన్ జైన్, ఎథికల్ హ్యాకర్ శుభాంక్ సింఘాయ్ తదితరులు పాల్గొన్నారు.
