- వీసా, మాస్టర్ క్రెడిట్ కార్డులు లింక్
- ఐఫోన్, యాపిల్ వాచ్‌తో చెల్లింపులు
న్యూఢిల్లీ: టెక్ కంపెనీ యాపిల్.. ఇండియా డిజిటల్ పేమెంట్స్ సెక్టార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి ‘యాపిల్ పే’ సర్వీస్‌లను ప్రారంభించింది. ఎటువంటి పిన్ నంబర్, ఓటీపీలు ఎంటర్ చేయకుండానే సురక్షితంగా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి యాక్సిస్ బ్యాంక్ జారీ చేసిన వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డుదారులకు మాత్రమే ఈ అవకాశం ఉంది. త్వరలో మిగిలిన బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. క్రెడిట్ కార్డులను యాపిల్ వాలెట్‌కు జత చేసి, దేశవ్యాప్తంగా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) పాయింట్లు, ఆన్‌లైన్ స్టోర్లలో పేమెంట్స్ చేయొచ్చు. ఇందుకు ఇంటర్నెట్ లేదా మొబైల్ డేటా అవసరం లేదు. ఫేస్ ఐడీ లేదా ఫింగర్ ప్రింట్ సాయంతో ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది.
యాపిల్ వాచ్‌తోనూ పేమెంట్
ఐఫోన్, ఐపాడ్, యాపిల్ వాచ్‌లతోనూ పేమెంట్స్ చేయొచ్చు. వాచ్‌తో పేమెంట్స్ చేయాలనుకుంటే సైడ్ బటన్‌ను రెండుసార్లు నొక్కి పీవోఎస్ మెషిన్ వద్ద ట్యాప్ చేస్తే పేమెంట్ పూర్తవుతుంది. త్వరలోనే మ్యాక్ నోట్‌బుక్స్‌కు కూడా ఈ సేవలను విస్తరించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాల్లో యాపిల్ పే అందుబాటులో ఉంది. దీంతో
విదేశాలకు వెళ్లినప్పుడు కరెన్సీ మార్పిడి లేదా ఫిజికల్ కార్డులతో పనిలేకుండా, కాంటాక్ట్‌లెస్ పాయింట్లలో ఐఫోన్ లేదా యాపిల్ వాచ్‌తో నేరుగా చెల్లింపులు చేయొచ్చు.
సేఫ్టీకి పెద్ద పీట
యాపిల్ పేలో క్రెడిట్ కార్డును యాడ్ చేసినప్పుడు 16 అంకెల కార్డ్ నంబర్ ఫోన్‌లో గానీ లేదా యాపిల్ సర్వర్లలో గానీ సేవ్ అవ్వదు. దానికి బదులుగా ఒక ప్రత్యేకమైన ఎన్‌క్రిప్టెడ్ కోడ్ క్రియేట్ అవుతుంది. షాప్‌లలో స్వైప్ చేసినా లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినా దుకాణదారుడికి యూజర్ పేరు, కార్డ్ నంబర్ లేదా సీవీవీ కనిపించవు. కార్డ్ క్లోనింగ్ లేదా డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉండదు. యూజర్ ఎక్కడ, ఎంత ఖర్చు చేశారనే పేమెంట్ హిస్టరీని యాపిల్ తన సర్వర్లలో నిల్వ చేయదు. ట్రాన్సాక్షన్ వివరాలు యూజర్‌కు, బ్యాంక్‌కు మాత్రమే తెలుస్తుంది.
