దేశంలో 2.10 కోట్ల ఫ్యాక్టరీ కొలువులు.. తయారీ ఊపందుకోవడంతో రికార్డ్‌‌‌‌

దేశంలో 2.10 కోట్ల ఫ్యాక్టరీ కొలువులు.. తయారీ ఊపందుకోవడంతో రికార్డ్‌‌‌‌

న్యూఢిల్లీ:  దేశంలోని ఫ్యాక్టరీలలో  పనిచేస్తున్న వారి సంఖ్య తొలిసారిగా 2 కోట్ల మైలురాయిని దాటింది. ముఖ్యంగా  వస్తువుల తయారీ పెరగడంతో  ఒక్క ఏడాదిలోనే  ఏకంగా 14 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు లభించాయి. కేంద్రం విడుదల చేసిన  యాన్యువల్‌‌‌‌ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ (ఏఎస్‌‌‌‌ఐ)  డేటా ప్రకారం,  ఈ కొలువుల్లో నేరుగా మెషిన్లపై పనిచేసే కార్మికులు (షాప్‌‌‌‌ఫ్లోర్ వర్కర్లు), సూపర్‌‌‌‌వైజర్లు, టెక్నీషియన్లు, ఫ్యాక్టరీ గేట్ వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బంది, అక్కడ ఉండే మేనేజర్లు, అడ్మిన్ సిబ్బంది వంటి రోల్స్‌‌‌‌  ఉన్నాయి.  

బేసిక్ మెటల్స్, మోటార్ వెహికల్స్‌‌‌‌, కెమికల్ ప్రొడక్ట్స్‌‌‌‌, ఫార్మాస్యూటికల్స్‌‌‌‌, ఫుడ్ ప్రొడక్ట్స్ రంగాలలో ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు.      2024–25 నాటికి దేశంలోని మొత్తం పరిశ్రమలలో పనిచేస్తున్న మొత్తం వ్యక్తుల సంఖ్య 2.10 కోట్లకు చేరగా, 2023–24లో ఈ సంఖ్య 1.96 కోట్లుగా ఉంది.  అంటే పరిశ్రమలన్నింటిలో కలిసి మొత్తం 14 లక్షల మంది ఉద్యోగులు అదనంగా చేరారు.  

ఈ మొత్తం కొత్త ఉద్యోగాల వృద్ధి దాదాపు మొత్తం తయారీ రంగం  నుంచే ఉండడం గమనార్హం.  ఇతర రంగాలు (విద్యుత్, యుటిలిటీస్ మొదలైనవి) స్థిరంగా ఉన్నప్పటికీ, కేవలం ఫ్యాక్టరీలలో వస్తువుల ఉత్పత్తి పెరగడం వల్లే ఈ  కొత్త ఉద్యోగాలు సాధ్యమయ్యాయి. ఫ్యాక్టరీలలో పనిచేసేవారిలో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌‌‌‌, ఉత్తర ప్రదేశ్‌‌‌‌, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు.