- అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం
- కట్టుబడి ఉంటామని టెక్ దిగ్గజాల అంగీకారం
- ట్రంప్ సంతకం.. టెక్ దిగ్గజాల అంగీకారం
వాషింగ్టన్ డీసీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నియంత్రణకు కట్టుబడి ఉంటామని అమెరికా టెక్ దిగ్గజాలు ప్రకటించాయి. ఈమేరకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఓ నైతిక కట్టుబాటు ఒప్పందంపై ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. కృత్రిమ మేధపై ఇటీవలి కాలంలో నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న వేళ దిగ్గజ కంపెనీల సీఈవోలు, ఉన్నతాధికారులతో ట్రంప్ మంగళవారం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మాన్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐ నియంత్రణకు సంబంధించి కంపెనీలు తమ స్వీయ నియంత్రణ పాలసీలు, కొత్త ఉత్పత్తులను పరీక్షించేందుకు ఏఐ సంస్థలు అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలపై ఈ మీటింగ్లో చర్చించారు.
అనంతరం ట్రంప్ యంత్రాంగం రూపొందించిన ఏఐ ప్లెడ్జ్పై అమెరికా ప్రెసిడెంట్ హోదాలో ట్రంప్ సంతకం చేయగా.. టెక్ దిగ్గజాల ప్రతినిధులు కూడా సంతకం చేశారు. ఈ అగ్రిమెంట్ వివరాలను ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో వెల్లడించారు. ఇటీవల ఏఐ కంపెనీలకు చెందిన కొన్ని ఉత్పత్తులు భద్రతా పరీక్షల్లో విఫలం కావడంతో ప్రజల్లో సందేహం వ్యక్తమవుతోందని, వారు నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు.
ఈ నేపథ్యంలో తన యంత్రాంగం ఈ ఏఐ ప్లెడ్జ్ను తీసుకొచ్చిందని వివరించారు. ఏఐ కంపెనీలకు ఈ అగ్రిమెంట్ ఒకరకంగా రాజ్యాంగం లాంటిదని, అవి పాటించాల్సిన సెక్యూరిటీ విధానాలను సూచిస్తుందని తెలిపారు. అదేసమయంలో, ఏఐ అభివృద్ధిని ఈ అగ్రిమెంట్ అడ్డుకోదని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు, ఏఐని ఇకపై సూపర్ ఇంటెలిజెన్స్ (ఎస్ఐ) గా వ్యవహరించాలంటూ ట్రంప్ ఈ సందర్భంగా ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు.
