500కు పైగా పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ బకాయిల వసూళ్ల కోసం జీఎస్టీ జారీ చేసిన డిజిటల్ నోటీసులు కరెక్టేనని హైకోర్టు సమర్థించింది. జీఎస్టీ నోటీసులపై డిజిటల్ సంతకం ఉన్నా లేకపోయినా అవి పూర్తిగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి జారీ చేస్తున్న నోటీసుల్లో సంతకాలు లేవంటూ వాటి చట్టబద్ధతను సవాలు చేస్తూ హైకోర్టులో ఏకంగా 500కి పైగా పిటిషన్‌లు దాఖలయ్యాయి.
ఈ వివాదంపై సీజే జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ ఎన్.తుకారాంజీ, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. ఎలాంటి సంతకాలు లేకుండానే జీఎస్టీ నోటీసులు జారీ చేస్తున్నారని, చట్టపరంగా సైన్ ఉండటం తప్పనిసరి అని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్ ఊరిళ్ల వాదిస్తూ..డిజిటల్ సంతకం ఉన్నప్పటికీ నోటీసును ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో ప్రింట్‌లో సంతకం కనిపించడం లేదని, అందువల్ల సైన్ లేకపోయినా సాంకేతికంగా ఉన్నట్లుగానే పరిగణించవచ్చని వివరించారు.
కోర్టు స్పందిస్తూ.. డిజిటల్ సంతకంతో నోటీసులు జారీ చేయడాన్ని సమర్థించింది. ఒకవేళ డిజిటల్ సంతకం నేరుగా కనిపించకపోయినా, నిబంధనల ప్రకారం అధికారిక పోర్టల్ ద్వారా జారీ చేసినందున ఆ నోటీసులు చెల్లుబాటవుతాయని తేల్చిచెప్పింది. గతేడాది సెప్టెంబరు 18న జీఎస్టీ అధికారులు స్వయంగా హైకోర్టుకు వచ్చి జీఎస్టీ పోర్టల్ పనితీరుపై గంటన్నరకు పైగా ప్రత్యక్షంగా వివరణ ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తుచేసింది.
నోటీసులకు సంబంధించి ఇతర ఏవైనా అభ్యంతరాలుంటే చట్టబద్ధంగా అప్పీళ్లు చేసుకోవాలని సూచించింది. ఒకవేళ అప్పీళ్లు చేయని పక్షంలో బకాయిల చెల్లింపులు పూర్తి చేసేందుకు రెండు వారాల గడువును ఇస్తున్నట్లు హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. కాగా..ఈ తీర్పు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ. 1,500 కోట్లకు పైగా బకాయిలు వసూలయ్యే అవకాశం ఉందని అధికారిక అంచనాలు వెల్లడిస్తున్నాయి.
