స్కిల్ యూనివర్సిటీలో లెర్న్ అండ్ ఎర్న్ విధానం: మంత్రి వివేక్వెంకటస్వామి

స్కిల్ యూనివర్సిటీలో లెర్న్ అండ్ ఎర్న్ విధానం: మంత్రి వివేక్వెంకటస్వామి
  • ఒడిశాలోని ‘సెంచూరియన్ వర్సిటీ’ తరహాలో అమలు చేస్తం: మంత్రి వివేక్​
  •  లెర్న్ అండ్ ఎర్న్, లైవ్ ప్రొడక్షన్ యూనిట్ల విజిట్ 
  • నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక శిక్షణ విధానాల పరిశీలన
  • స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐల ఆధునీకరణపై చర్చలు
  • బృందంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, కమిషనర్ కాంతి వెస్లీ  

హైదరాబాద్, వెలుగు: ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీ తరహా లైవ్ ఎంటర్‌‌ప్రైజ్ మోడల్‌‌ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర శక్తి శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. యువతకు టెక్నికల్ ఎడ్యుకేషన్‌‌తో పాటు ఇండస్ట్రియల్ అవసరాలకు తగిన ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వ ఉన్నత స్థాయి బృందం ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌‌మెంట్(సీయూటీఎం)ను సందర్శించింది. 

మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో సాగిన ఈ పర్యటనలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఉపాధి-శిక్షణ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ పాల్గొన్నారు. ఒడిశా సర్కారు ‘స్కిల్ యూనివర్సిటీ’గా  గుర్తించిన సెంచూరియన్ వర్సిటీ అమలు చేస్తున్న ‘లెర్న్ అండ్ ఎర్న్’ విధానం, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన కరికులం, లైవ్ ప్రొడక్షన్ యూనిట్ల నిర్వహణ తీరును బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. సాధారణ డిగ్రీలతో పాటు పరిశ్రమ స్థాయి పరికరాలపై విద్యార్థులకు ఇస్తున్న ప్రయోగాత్మక శిక్షణపై ఆరా తీసింది. ఒడిశా వర్సిటీలో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాలను తెలంగాణలో అమలు చేసే అవకాశాలను అధ్యయనం చేసింది. 

ఈ పర్యటనలో భాగంగా వర్సిటీ క్యాంపస్‌‌లో నిర్వహిస్తున్న వివిధ సాంకేతిక, పారిశ్రామిక ఉత్పత్తి విభాగాలను ప్రతినిధి బృందం నేరుగా సందర్శించింది. అడ్వాన్స్‌‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ), ట్రాన్స్‌‌ఫార్మర్ల తయారీ, సీఎన్‌‌సీ మెషినింగ్ విభాగాల్లో విద్యార్థులు చేపడుతున్న పనులను పరిశీలించింది. వీటితో పాటు స్మార్ట్ అగ్రికల్చర్, అప్పారెల్ ప్రొడక్షన్ రంగాల్లో కొనసాగుతున్న లైవ్ ప్రొడక్షన్ యూనిట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్కడి ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకుంది. ఈ ఉత్పత్తుల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటూ విద్యార్థులు చదువుతో పాటే స్టైపెండ్ పొందే పద్ధతిని వర్సిటీ నిర్వాహకులు వివరించారు. 

థియరీతోపాటు ప్రాక్టికల్ ప్రొడక్షన్.. 

గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించేందుకు ‘గ్రామ్ తరంగ్’ సంస్థ ద్వారా చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను కూడా మంత్రి వివేక్ బృందం అధ్యయనం చేసింది. విద్యార్థులకు థియరీతో పాటు ప్రాక్టికల్ ప్రొడక్షన్‌‌లో భాగస్వామ్యం కల్పించడం ద్వారా పరిశ్రమలకు అవసరమైన పూర్తిస్థాయి నైపుణ్యాలు ఎలా అందుతున్నాయనే అంశాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో నోట్ చేసుకున్నారు. అనంతరం సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ముక్తి కె. మిశ్రా, వివిధ విభాగాల అధిపతులతో మంత్రి వివేక్ బృందం సమావేశమైంది. 

లైవ్ ప్రొడక్షన్ యూనిట్ల నిర్వహణ, వాటికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ, పారిశ్రామిక రంగంతో భాగస్వామ్యం, విద్యా కోర్సుల్లో క్రెడిట్ విధానం అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నైపుణ్య సంస్కరణలను మంత్రి వివేక్ వివరించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నామని, ‘పీఎం సేతు’ పథకం ద్వారా ఐటీఐలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. 

‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’లో సెంచూరియన్ వర్సిటీ తరహా లైవ్ ఎంటర్‌‌ప్రైజ్ మోడల్‌‌ను ప్రవేశపెట్టే అంశంపై చర్చించారు. ఐటీఐలు, ఏటీసీలు, స్కిల్ యూనివర్సిటీల మధ్య పరస్పర భాగస్వామ్యంతో పాటు క్రెడిట్ అనుసంధానం కల్పించే సాంకేతిక అంశాలపై వర్సిటీ యాజమాన్యంతో సమాలోచనలు జరిపారు. 

సెంచూరియన్‌‌ వర్సిటీతో భాగస్వామ్యం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గ్రామీణ, పట్టణ ప్రాంత యువతకు తయారీ రంగంలో ప్రత్యక్ష ఉత్పత్తి అనుభవం కల్పించడం అత్యంత కీలకమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. పరిశ్రమల్లో ఉపయోగించే ఆధునిక యంత్రాలు, ఉత్పత్తి ప్రక్రియలపై ముందే పూర్తి అవగాహన ఉంటే ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే మెరుగైన ఫలితాలు ఇవ్వడం సాధ్యమవుతుందని చెప్పారు.

అనంతరం ఉపాధి, శిక్షణ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ మాట్లాడుతూ.. తెలంగాణలో మాస్టర్ ట్రైనర్లకు ఉన్నత స్థాయి శిక్షణ అందించేందుకు, కరికులం రూపకల్పనను ఆధునీకరించేందుకు సెంచూరియన్ వర్సిటీ అనుభవాలు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులకు ప్రత్యక్ష ఉత్పత్తి అనుభవం, క్రెడిట్ ఆధారిత నైపుణ్య విద్య, అంతర్జాతీయ ప్లేస్‌‌మెంట్స్ లక్ష్యంగా సెంచూరియన్ యూనివర్సిటీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు బృందం స్పష్టం చేసింది.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ప్రాణహిత - చేవెళ్లపై ముందుకెళ్తాం

న్యూఢిల్లీ, వెలుగు: ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ప్రాణహిత–-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్  ప్రాంతాల్లో సాగునీటి కొరతను తీర్చేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్  పాటిల్‌‌ను మంత్రి గడ్డం వివేక్  వెంకటస్వామి, తాను కలిసామని ఎంపీ తెలిపారు. 

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించామని వెల్లడించారు. ఈ అంశాలను బుధవారం ఆయన మీడియాకు వెల్లడించారు. కాకా వెంకటస్వామి ప్రాణహిత-–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్  ప్రాంతానికి సాగునీరు అందించాలని కలలు కన్నారని గుర్తు చేశారు. 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలన్నది ఆయన ఆశయమన్నారు.