ఆసియా క్రీడల్లో ఇండియా విమెన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. సెమీస్‌లో ఇండియా 2–0తో సౌత్ కొరియాపై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం కరువును తీర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. 1982 న్యూఢిల్లీ క్రీడల తర్వాత ఇండియా ఇప్పటి వరకు గోల్డ్ గెలవలేదు. ఇండియా తరఫున ఇషికా చౌదరి (44వ నిమిషం), కెప్టెన్ సలీమా టేటే (48వ నిమిషం) గోల్స్ కొట్టారు.
మ్యాచ్ ఆరంభం నుంచి ఇండియా ప్లేయర్లు కొరియా డిఫెన్స్‌పై విరుచుకుపడ్డారు. తొలి రెండు క్వార్టర్లలోనే వరుసగా పెనాల్టీ కార్నర్లు సంపాదించినప్పటికీ, కొరియా గోల్ కీపర్ అడ్డుకోవడంతో గోల్స్ లభించలేదు. మూడో క్వార్టర్ ముగిసే సమయానికి పెనాల్టీ కార్నర్‌ను చక్కటి వేరియేషన్‌తో ఇషికా గోల్‌గా మలిచింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే సలీమా అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది.
