దమ్ముంటే KTR ను అరెస్ట్ చెయ్ : ఎంపీ రఘునందన్ రావు

దమ్ముంటే KTR ను అరెస్ట్ చెయ్ : ఎంపీ రఘునందన్ రావు
  •     సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు సవాల్  

హైదరాబాద్, వెలుగు: సిరిసిల్లపై దండయాత్ర చేయడం కాదు.. దమ్ముంటే కేటీఆర్‌‌ను అరెస్ట్ చేసి చూపించాలని ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్​రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాల్సిన సీఎం.. తన నియోజకవర్గంపైనే దృష్టి పెడుతూ కొడంగల్ సీఎంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌‌లోని లోక్ భవన్‌‌లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇతర నేతలతో కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో ఈనెల 4న అమూల్ చిల్లింగ్ సెంటర్​ను అమిత్​షా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌‌ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదని చెప్పారు. 

ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ నెల 6న గవర్నర్‌‌ శివప్రసాద్‌‌ శుక్లా ఆధ్వర్యంలో భారీ వృక్షారోపణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. రామాయంపేట నుంచి సిద్దిపేట జాతీయ రహదారి వెంట 44 కిలోమీటర్ల మేర ఒకే రోజు 30 వేల బాదం మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌‌ లీడర్‌‌ పాయల్‌‌ శంకర్‌‌ మాట్లాడుతూ మావల మండలం బట్టిసవర్గాం గ్రామంలోని కొమురం భీం కాలనీలో 30 ఏండ్లుగా నివసిస్తున్న 500 ఆదివాసీ కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు. పట్టాలు లేకపోవడంతో కరెంట్‌‌, తాగునీటి వంటి కనీస సౌకర్యాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని తెలిపారు.