- ఆర్ఎస్ఎస్ అదానీ, అంబానీ గుప్పిట్లో
- ఇరాన్ యుద్ధంపై పీఎం ప్రేక్షక పాత్ర
- ఆయనది ఆలింగన దౌత్యమని ఎద్దేవా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి వేళల్లో నిద్ర పోలేకపోతున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. దానికి కొన్ని బహిర్గత, మరికొన్ని అంతర్గత కారణాలు ఉన్నాయని అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన 'రచనాత్మక కాంగ్రెస్ జాతీయ సదస్సు'లో రాహుల్ మాట్లాడారు. ‘చాణక్యుడని చెప్పుకునే హోం మంత్రి అమిత్ షా 20 రోజుల పాటు పార్లమెంట్‌కు ఎందుకు రాలేకపోయారు?’ అని ప్రశ్నించారు. ‘ఆర్ఎస్ఎస్‌ను అంబానీ, అదానీ తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ అదానీ చేతిలో సాధనంగా మారింది’ అని పేర్కొన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాల వల్ల ఆర్ఎస్ఎస్ మద్దతుదారులైన చిన్న వ్యాపారులు నష్టపోయారని, అనంతరం ఆ సంస్థ బడా వ్యాపారులకు కొమ్ముకాస్తోందని రాహుల్ విమర్శించారు.
‘ఆలింగన దౌత్యం’పై రాహుల్ ఎద్దేవా
ఇరాన్, -అమెరికా యుద్ధంపై మోదీ ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని రాహుల్ విమర్శించారు. ప్రధాని విదేశాంగ విధానంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘ఈ వింత ఆలోచన మోదీ మనసులోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. విదేశాంగ విధానం అంటే విదేశీ నేతలను కౌగిలించుకోవడమేనని ఆయన అనుకుంటున్నారు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు చెబుతూనే వేదికపై ఉన్న కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ వద్దకు వెళ్లి రాహుల్ ఆయనను గట్టిగా కౌగిలించుకున్నారు. అయితే, రాహుల్ తనను కౌగిలించుకోగానే కాంగ్రెస్ నాయకుడు దీక్షిత్ సరదాగా స్పందిస్తూ.. ‘నన్ను ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అనుకుని కౌగిలించుకోవడం లేదు కదా?’ అని చమత్కరించారు. దీనికి రాహుల్ నవ్వుతూ తాను ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదని బదులివ్వడంతో సభలో నవ్వులు పూశాయి. కాగా, రాహుల్ గాంధీ, సందీప్ దీక్షిత్‌ల వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ నిషికాంత్ దూబే ఆ వీడియోను పోస్ట్‌చేసి.. ‘రాహుల్ గాంధీ మానసిక స్థితి బాగుందని మీరు భావిస్తున్నారా?’ అని ప్రశ్నించారు.
