ముంబై: టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా టాటా స్టీల్ గ్లోబల్ సీఈఓ, ఎండీగా పనిచేస్తున్న టీవీ నరేంద్రన్ ను (61) నియమిస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 1988లో టాటా స్టీల్‌లో చేరిన నరేంద్రన్, కష్టకాలంలో సంస్థను లాభాల బాట పట్టించారు. చంద్రశేఖరన్‌లాగే ఆయన కూడా సుదీర్ఘకాలంగా టాటా గ్రూప్‌లోనే పనిచేస్తుండటం, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటాతో మంచి సంబంధాలు ఉండటం కలిసొచ్చే అంశాలు.
ఇండస్ట్రియల్ బ్యాక్‌గ్రౌండ్
ఎన్ఐటీ తిరుచ్చి, ఐఐఎమ్ కలకత్తాలో చదివిన నరేంద్రన్, 1988లో టాటా స్టీల్‌లో చేరి దాదాపు నాలుగు దశాబ్దాలుగా గ్రూప్‌లోనే కొనసాగుతున్నారు. చంద్రశేఖరన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాగా, నరేంద్రన్‌కు ఇండస్ట్రియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. టాటా స్టీల్ ఎండీగా కంపెనీ అప్పులను తగ్గించి, ఆర్థిక పనితీరును మెరుగుపరిచి, బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో సంక్షోభంలో ఉన్న వ్యాపారాలను గాడిలో పెట్టారు. ఒక వేళ టాటా సన్స్ చైర్మన్‌గా నియమితులైతే ఎయిర్ ఇండియాను గాడిలో పెట్టడం, సెమీకండక్టర్ బిజినెస్‌ను విస్తరించడం, టాటా క్యాపిటల్, టీసీఎస్ బిజినెస్‌లను విస్తరించడంపై ఆయన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.
చైర్మన్ ఎంపికకు కమిటీ
ప్రస్తుత టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ (63) పదవిలో కొనసాగేందుకు నిరాకరించడంతో కొత్త చైర్మన్ కోసం టాటా గ్రూప్ వెతకడం మొదలు పెట్టింది. ఇందుకోసం ఒక సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు 'టాటా ట్రస్ట్స్' గురువారం ప్రకటించింది. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (ఎస్‌డీటీటీ) నేతృత్వంలో ట్రస్టీలు సమావేశమై, టాటా సన్స్ నిబంధనల ప్రకారం వారసుడి ఎంపిక ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని తీర్మానించాయి.
చంద్రశేఖరన్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపిన దొరాబ్జీ టాటా ట్రస్ట్, గత పదేళ్లుగా టాటా గ్రూప్‌నకు ఆయన అందించిన సేవలను, సమర్థవంతమైన నాయకత్వాన్ని కొనియాడింది. నాయకత్వ మార్పిడి సజావుగా సాగేందుకు మద్దతు ఇస్తామని తెలిపింది. కాగా, ఈ నెల 18న టాటా సన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం) జరగనున్న నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఏర్పాటు కావడం గమనార్హం.
