- వాళ్ల గోతులను వాళ్లతోనే తీయించి ఘాతుకం..
మోతె (మునగాల), వెలుగు: సూర్యాపేట జిల్లా మోతె మండలం బీక్యాతండాకు చెందిన దంపతులను ఇద్దరు కానిస్టేబుళ్లే హత్య చేసినట్లు తెలుస్తోంది. మోతె పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షరీఫ్ తన తోటి కానిస్టేబుల్ సుందరయ్య తో కలిసి హత్య చేసినట్లు సమాచారం. తండాకు చెందిన హలావత్ బూబాతో కానిస్టేబుల్షరీఫ్ కు వివాహేతర సంబంధం ఉంది. గతంలో బూబా కూతురు పెండ్లి సమయంలో షరీఫ్ఆమెకు రూ.3 లక్షలు అప్పుగా ఇచ్చాడు.
ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధించడం పాటు వివాహేతర సంబంధం గురించి బయట పెడతానని బూబా బ్లాక్మెయిల్ చేసినట్టు తెలిసింది. ఈ విషయం బయటకు వస్తే తనకు సమస్య అవుతుందని భావించిన షరీఫ్ఆమెను చంపేయాలని ప్లాన్ చేసి, తోటి కానిస్టేబుల్ సుందరయ్య సహకారం కోరాడు.
తర్వాత పట్టుబడిన గంజాయిని పాతి పెట్టేందుకు గుంతలు తీయాలని చెప్పి బూబా, ఆమె భర్త నాగులును సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి దగ్గరకు తీసుకెళ్లారు. భార్యాభర్తలు గుంతలు తీస్తుండగా ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి రాడ్తో బూబాను కొట్టడంతో ఆమె చనిపోయింది. తర్వాత నాగులుపై సైతం కర్రతో దాడి చేసి హత్య చేసిన అనంతరం ఇద్దరినీ అక్కడే పాతిపెట్టినట్లు సమాచారం. విషయం బయటకు రావడంతో పోలీసులు కానిస్టేబుళ్లు షరీఫ్, సుందరయ్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
