తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివారికి కీలక పదవులా? : రాజ గోపాల్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివారికి కీలక పదవులా? : రాజ గోపాల్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  •     నేను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజల పక్షానే నిలబడతా: రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి

రవీంద్రభారతి, వెలుగు: తెలంగాణ ఉద్యమంతో, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీతో సంబంధం లేని వారు, ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగే వారు నేడు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తుండటం బాధాకరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ రవీంద్రభారతిలో కళాకారుడు ఏపూరి సోమన్న 25 ఏండ్ల పాటల ప్రస్థానంపై రూపొందించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారిగా గళం విప్పింది తానేనని, అందుకే అప్పటి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తనను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు 100 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దించినా, దానిని కూడా తాను ఒక విజయంగానే భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.  ఏపూరి సోమన్న పాడిన 'ఎవరి పాలైందిరో తెలంగాణ' పాటలో ప్రస్తావించిన పరిస్థితులే నేటికీ కొనసాగడం బాధాకరమన్నారు. సోమన్న రూపం, గళం చూస్తే దివంగత ప్రజాగాయకుడు గద్దర్‌‌‌‌‌‌‌‌ గుర్తుకొస్తారని పేర్కొన్నారు. 

ఏపూరి సోమన్న వంటి కళాకారులు, ఉద్యమకారులకు తాను అండగా ఉంటానని, వచ్చే ఎన్నికల్లో సోమన్న చట్టసభల్లో అడుగుపెడతారని రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. రాజకీయాలను మార్చే శక్తి తనకు ఉందని, నిజాయితీ కలిగిన వారు తన వెంట నిలిస్తే తమిళనాడు తరహాలో రాజకీయ మార్పు తీసుకురాగలమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల రూపాయలను దోచుకుంటున్న వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. తాను గెలిపించిన ఓ ఎమ్మెల్యే కులం కార్డును అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. పదవులు కిరీటాలు కావని, ప్రజలకు సేవ చేసే అవకాశం మాత్రమేనని రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పుష్పలీల, నల్గొండ గద్దర్, జేరిపోతుల పరుశురాం, పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొన్నారు.