- 2 వేల కోట్ల హెరిటేజ్ భూముల అమ్మకంపై సీఎంకు హరీశ్ రావు లేఖ
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 17, 21 తేదీల్లో టీజీఐఐసీ నిర్వహించ తలపెట్టిన వేలం పాటలను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తున్నారా.. లేక రియల్ ఎస్టేట్ ఏజెంటులా వ్యవహరిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలకు తెగబడటమే మీ ప్రభుత్వ పనిగా పెట్టుకున్నారా అని నిలదీశారు. రాయదుర్గంలోని పన్మక్తలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 10.63 ఎకరాల విలువైన హెరిటేజ్ భూమిని వేలం వేయడంపై గురువారం ఆయన సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు. 2020లో ఇదే భూములను కాపాడాలంటూ కోర్టు మెట్లెక్కిన రేవంత్ రెడ్డి.. నేడు సీఎం పీఠం ఎక్కగానే అదే భూమిపై ‘థర్డ్ పార్టీ’ హక్కులు సృష్టించేలా వేలానికి ఎలా అనుమతి ఇస్తారని నిలదీశారు. ‘‘నాడు ప్రభుత్వ భూములు జాతి సంపద అని ఉపన్యాసాలు దంచిన నువ్వు.. నేడు భూములన్నీ అమ్మకానికి పెడుతున్నావు.
కంచ గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి నేడు రాయదుర్గ్ వరకు ఎక్కడిక్కడ భూములు అమ్మే కుట్రలు చేయడం సిగ్గుచేటు’’ అని మండిపడ్డారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారమే జీవో 4 ద్వారా సర్వే నం.83లోని భూమిని హెరిటేజ్ సైట్‌గా గుర్తించినట్లు హరీశ్ రావు లేఖలో గుర్తుచేశారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన ఈ హెరిటేజ్ భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే.. తన అనుయాయుల కోసం తెగనమ్మేందుకు సిద్ధమైందన్నారు. గతంలో ఇదే సర్వే నంబర్‌లో 6.2 ఎకరాలను ఎకరాకు దాదాపు రూ.237 కోట్ల చొప్పున వేలం వేస్తే ఎస్‌బీఐ కోర్టుకెళ్లిందని, ప్రస్తుతం ఆ అంశం హైకోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉందని తెలిపారు. అసలు యాజమాన్య వివాదాలు, హెరిటేజ్ అంశాలు, వక్ఫ్ హక్కుల వివాదాలు ఉన్న భూమికి.. హక్కులేంటో తేల్చకుండా వేలం వేయడం వెనుక ఆంతర్యమేంటని హరీశ్ నిలదీశారు.
