- పేద, మధ్య తరగతిపై భారం పడొద్దనే ఎంఎండీఆర్ సవరణ బిల్లు: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: ఖనిజాల విషయంలో రాష్ట్రప్రభుత్వాల అధికారాలను లాగేసుకుంటున్నామనే ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం పార్లమెంట్‌లో ఆమోదం పొందిన మైన్స్ అండ్ మినరల్స్(డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్స్) సవరణ బిల్లు –2026పై వస్తున్న వార్తలపై కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ బిల్లు కేవలం మేజర్ మినరల్స్ కు సంబంధించినది మాత్రమే అన్నారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న మైనర్ మినరల్స్ విషయంలో ఎలాంటి సవరణలు తీసుకురాలేదని క్లారిటీ ఇచ్చారు. మేజర్ మినరల్స్ చాలా కీలకమైనవని, వీటి ధరలు పెరిగితే పేద, మధ్య తరగతి, పరిశ్రమలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు.
పేద, మధ్యతరగతి వారి ఇండ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పన విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. అందుకే సిమెంట్, స్టీల్, అల్యూమినియం ఉత్పత్తికి కీలకమైన మేజర్ మినరల్స్ ధరలు పెరగకూడదనే ఉద్దేశంతో ఈ చట్టంలో సవరణలు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ‘ఈ బిల్లు ద్వారా రాష్ట్రాల రెవెన్యూ ఏమాత్రం తగ్గడం లేదు. సామాన్యుల మౌలిక వసతుల కల్పనలో వినియోగించే మేజర్ మినరల్స్ విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధమైన ధర ఉండాలనే ఉద్దేశంతో తాజా బిల్లు తీసుకొచ్చాం’ అని వివరించారు. రాష్ట్రాలతో చర్చించిన తర్వాత దీనిపై గైడ్లైన్స్ ఇస్తామన్నారు. క్రిటికల్ మినరల్స్ కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తున్నందున కేంద్ర ప్రభుత్వం రూ.34వేల కోట్లతో ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ను ప్రారంభించిందని చెప్పారు. ఇప్పటికే 20 దేశాలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు.
