మహారాష్ట్రలోని ముంబైలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక యువకుడిని నవీ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లింకిట్ లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల కుమార్ బాబు చవాన్ అనే నిందితుడిని పట్టుకున్నారు. పార్ట్ టైం డెలివరీ ఏజెంట్ గా.. ఫుల్ టైం దొంగగా మారి దొరకకుండా పరారవుతున్న సమయంలో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
నిందితుడు తన డెలివరీ పనుల నిమిత్తం సన్‌పాడ, వాషి, కోపర్‌ఖైరాణె ప్రాంతాల్లోని ప్రతి సందు, గల్లీ, రోడ్ల గురించి పూర్తి అవగాహన తెచ్చుకున్నాడు. ఈ ప్రాంతాలపై తనకు ఉన్న పూర్తి భౌగోళిక అవగాహనను ఆసరాగా చేసుకుని.. చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని ఈ దొంగతనాలకు పాల్పడి, పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేవాడని విచారణలో తేలింది.
ఈ అరెస్టుతో నిందితుడిపై మొత్తం తొమ్మిది కేసులను పోలీసులు చేధించారు. అతని వద్ద నుంచి సుమారు రూ.17 లక్షల 92వేలు విలువ చేసే 68.84 గ్రాముల బరువున్న ఎనిమిది బంగారు మంగళసూత్రాలు, గొలుసులతో పాటు నేరానికి ఉపయోగించిన స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొమ్మును నిందితుడు ఎక్కడ ఖర్చు చేశాడనే కోణంలో పోలీసులు కూపీ లాగారు.
ALSO READ : లేడీ డాక్టర్ను కొట్టి స్టెతస్కోప్ ఎత్తకపోయిన సైకో
ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడిన కుమార్ బాబు చవాన్, ఆ వ్యసనం తీర్చుకోవడానికి డబ్బులు చాలక ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో డెలివరీ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని నేరాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేయడం ద్వారా అనేక కేసులకు తెరపడిందని అధికారులు తెలిపారు. ఈరోజుల్లో అపార్ట్మెంట్స్ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఇలా కొందరు నేరస్తులు డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తూ పరిసరాలను రెక్కీ చేస్తున్నారు. అదును చూసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రజలు కూడా అర్థరాత్రులు అపరాత్రులు ఆర్డర్లు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం బెటర్. జరగరానిది జరిగాక లబోదిబోమనటం కంటే కొంత అప్రమత్తత అవసరం అంటున్నారు పోలీసులు.
