న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై ప్రమాద బాధితులకు త్వరగా వైద్యం అందించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రమాదం జరిగిన చోటుకు అంబులెన్స్ 10 నిమిషాల్లో చేరుకోకపోయినా, బాధితులను గోల్డెన్ అవర్‌లోపు ఆస్పత్రికి తీసుకెళ్లకపోయినా రూ.10 వేల జరిమానా విధించనుంది. అంబులెన్స్, పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్ల సేవల్లో నిర్లక్ష్యం చేస్తే కూడా ఫైన్లు పడనున్నాయి.
జీపీఎస్ లేదా ‘ఎన్‌హెచ్‌ఏఐ కేర్’ యాప్ పనిచేయకపోతే రూ.2,500, 1033 హెల్ప్‌లైన్ కాల్‌ను స్వీకరించడంలో నిమిషం కంటే ఎక్కువ ఆలస్యం చేస్తే రూ.5 వేలు, కాల్‌ను తిరస్కరిస్తే రూ.10 వేల ఫైన్ వేయనున్నారు. ప్రతి అంబులెన్స్ రోజూ 5 కిలోమీటర్ల డ్రై రన్ చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 3 వేల అంబులెన్స్‌లు, వెయ్యి పెట్రోలింగ్ వాహనాలు, 50 వేల క్రేన్లు పనిచేస్తున్నాయి.
