హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ మంచిరేవులలోని ‘ఫారెస్ట్ ట్రెక్ పార్క్’లో 15న (శనివారం) ప్రత్యేకంగా ‘నేచర్ క్యాంప్’ నిర్వహిస్తున్నట్లు సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజర్, ఈకో టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ శిరీష తెలిపారు. శనివారం సాయంత్రం 4.30 నుంచి ఆదివారం ఉదయం 10.00 గంటల వరకు ఈ క్యాంప్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా టెంట్ పిచింగ్ (గుడారాలు వేయడం), టీమ్ బిల్డింగ్ గేమ్‌లు, నోక్టర్నల్ వాక్ (రాత్రి పూట అడవిలో నడక), నైట్ క్యాంపింగ్, ఉదయాన్నే బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ వంటి రకరకాల కార్యక్రమాలు ఉంటాయన్నారు.
పాల్గొనే వారికి సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, ఉదయం బ్రేక్ ఫాస్ట్ సంస్థ తరపునే అందిస్తామన్నారు. 6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు ఒక్కరికి రూ. 1,199, 13 ఏళ్లు పైబడిన వారికి ఒక్కరికి . 1,999 రుసుం చెల్లించాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు www.deccanwoodsandtrails.com వెబ్‌సైట్‌ను సందర్శించి బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు.
