- రైడ్స్‌కు వెళ్లిన ఈగల్ ఫోర్స్‌పైకి కుక్కలను వదిలిన గ్యాంగ్
- స్క్రూడ్రైవర్‌తో సీఐపై ఎటాక్.. స్వల్ప గాయాలు.. ఇద్దరు మహిళలు సహా 11 మంది అరెస్ట్
- బాలానగర్‌లో గంజాయి స్మగ్లర్స్ పట్టివేత
- 14 కిలోల గంజాయి స్వాధీనం
- రాష్ట్రవ్యాప్తంగా 203 మంది కస్టమర్లు,
- ఆన్‌లైన్‌లో సేల్స్, డెడ్‌డ్రాప్ డెలివరీ
- కస్టమర్ల కోసం 40 టీమ్స్‌తో సోదాలు
- 100 మంది కస్టమర్లకు డ్రగ్ టెస్టులు, 81 మందికి పాజిటివ్
హైదరాబాద్, వెలుగు: గంజాయి డెన్‌పై రైడ్స్‌కు వెళ్లిన ఈగల్ ఫోర్స్ పోలీసులపై ముఠా సభ్యులు దాడులకు తెగబడ్డ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ఆర్డర్లు తీసుకొని, డెడ్‌డ్రాప్ విధానంలో గంజాయి సప్లయ్ చేస్తున్న ఓ ముఠా బాలానగర్ రాజీవ్‌కాలనీ కేంద్రంగా పనిచేస్తోంది. దీన్ని గుర్తించిన ఈగల్ ఫోర్స్ పోలీసులు గురువారం డెన్‌పై దాడులు చేయగా.. ముఠా సభ్యులు పోలీసులపైకి కుక్కలను వదిలి, స్క్రూడ్రైవర్‌తో సీఐపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో సీఐ చేతికి స్వల్ప గాయాలయ్యాయి.
చివరకు ముఠాకు చెందిన ఇద్దరు మహిళలు సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన బొల్లకిరణ్, బొల్ల దుర్గాప్రసాద్, బొల్ల కమలాకర్ సహా ఐదుగురు, ఒడిశాకు చెందిన ఆరుగురు ఉన్నారు. వీరి ఫోన్లలోని డేటా ఆధారంగా 203 మంది కస్టమర్లను గుర్తించారు. 40 టీమ్స్‌తో సోదాలు చేపట్టారు. 100 మందికి డ్రగ్ టెస్టులు చేయగా 81 మందికి పాజిటివ్ వచ్చింది. వారి నుంచి 14 కిలోల గంజాయి, ఎయిర్‌గన్, కారు, బైక్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ గురువారం వెల్లడించారు.
ఒడిశా నుంచి గంజాయి
హైదరాబాద్‌లో గంజాయి అమ్మకాలపై ఈగల్ ఫోర్స్‌అధికారులు పటిష్టమైన నిఘా పెట్టారు. సప్లయర్లు, పెడ్లర్ల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా బేగంపేట్ ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఓ గంజాయి సప్లయర్‌ను గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని 50 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని విచారించిన క్రమంలో బాలానగర్ కేంద్రంగా ఒడిశా గ్యాంగ్ చేస్తున్న గంజాయి హోల్‌సేల్ దందా బయటపడింది.ఈ మేరకు బాలానగర్ రాజీవ్ కాలనీలో నివాసం ఉంటున్న బొల్లకిరణ్, బొల్ల దుర్గాప్రసాద్, బొల్ల కమలాకర్ గ్యాంగ్ నిర్వహిస్తున్న గంజాయి డెన్‌పై ఈగల్ ఫోర్స్‌అధికారులు దాడులు నిర్వహించారు. ఒడిశా నుంచి పెద్ద మొత్తంలో గంజాయి హైదరాబాద్ తరలిస్తున్నట్టు గుర్తించారు.
సోషల్ మీడియాలో ఆర్డర్స్, డెడ్‌డ్రాప్ డెలివరీ
బొల్ల కిరణ్ గ్యాంగ్ పక్కా ప్రణాళికలతో 2022 నుంచి గంజాయి సప్లయ్ చేస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ అధికారుల విచారణలో వెల్లడైంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సహా సోషల్ మీడియాలో కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకుంటున్నారు. గూగుల్ పే సహా ఇతర పేమెంట్‌యాప్స్ ద్వారా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కస్టమర్లతో నేరుగా కలిసే అవకాశం లేకుండా డెడ్ డ్రాప్ విధానం పాటిస్తున్నారు. ఆర్డర్ చేసిన గంజాయికి సంబంధించిన ప్యాకెట్ ఫొటోను ముందుగా కస్టమర్‌కు పంపిస్తున్నారు.
గుర్తించడానికి వీలు లేకుండా చెత్తాచెదారం ఉన్న ప్రాంతాలను డెలివరీ స్పాట్స్‌గా ఎంచుకుంటున్నారు. స్పాట్‌ఫోటో, లొకేషన్ కస్టమర్‌కు పంపిస్తున్నారు. ఇలా గత ఐదేండ్లుగా ఆన్‌లైన్‌లో హోల్‌సేల్, రిటైల్‌గా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. గతేడాది కాలంలోనే 1,400 కిలోల గంజాయిని ఆన్‌లైన్‌లో విక్రయించినట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు రూ.2.54 లక్షల ఆన్‌లైన్ పేమెంట్స్‌ను జరిగినట్లు తెలిపారు.
