సొంతింటి కలను నిజం చేశారు..‘రాజర్షి షా గూడ’.. కలెక్టర్ పేరుతో ఊరు

సొంతింటి కలను నిజం చేశారు..‘రాజర్షి షా గూడ’.. కలెక్టర్ పేరుతో ఊరు
  • ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడంతో ..
  • దహిగూడ గ్రామస్తుల హర్షం

ఆదిలాబాద్, వెలుగు : ఇండ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి తమ సొంతింటి కలను నిజం చేసిన కలెక్టర్ కు గ్రామస్తులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. 

కలెక్టర్ పేరునే ఏకంగా తమ గ్రామానికి పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఆదిలాబాద్ రూరల్ మండలంలోని దహిగూడ గ్రామానికి చెందిన కొలాం గిరిజనులు 17 మందికి ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు కలెక్టర్ రాజర్షిషా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో ఆయనపై కృతజ్ఞతగా గ్రామస్తులు తమ గ్రామానికి 'రాజర్షి షా గూడ'గా పేరు పెట్టుకున్నారు. 

గురువారం కలెక్టర్ చేతుల మీదుగానే బోర్డును ఆవిష్కరించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కలెక్టర్ కాళ్లు కడిగి ఆహ్వానం పలికారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామానికి మరో 10 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 

అలాగే గిరిజన కుటుంబాలకు మేకలు, పాడి పశువుల యూనిట్ల మంజూరుతో పాటు మహిళలకు కుట్టు మెషీన్ ట్రైనింగ్, డిగ్రీ చదివిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. విద్యుత్ నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ఈఈని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో రవీందర్ రాథోడ్, హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ గోవింద్ పాల్గొన్నారు.