గౌరవెల్లి నిర్వాసితులకు ప్యాకేజీ ప్రకటించాలి : చాడ వెంకట్ రెడ్డి
హుస్నాబాద్, వెలుగు : 'మోదీ అధికారంలోకి వచ్చాక సాధించింది ఏమీ లేదు, రూ.60 లక్షల కోట్లుగా ఉన్న దేశం అప్పులు నేడు ఏకంగా రూ.200 లక్షల కోట్లకు చేరాయి' అని సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం జరిగిన సీపీఐ 'ప్రజా చైతన్య పాదయాత్ర' ముగింపు సభలో ఆయన మాట్లాడారు.
తాము కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్నంత మాత్రాన గుడ్డిగా మద్దతు ఇస్తామనుకుంటే పొరపాటేనని, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ కమిటీల పేరుతో నచ్చిన వారికి ఇండ్లు కేటాయిస్తే ఊరుకోబోమన్నారు.
గ్రామసభలు నిర్వహించి, అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో వరద కాల్వ పనుల కోసం మళ్లీ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
గౌరవెల్లి నిర్వాసితులకు ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించి ఆదుకోకపోతే మలిదశ ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో సీపీఐ ప్రజాశక్తిగా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డకు ఎర్రజెండాతోనే స్వాతంత్ర్యం వచ్చిందని, అవసరమైతే మావోయిస్టుల రూపంలో మరొక ఎర్రదండు వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు.
