కోర్టు ఉద్యోగాల పేరుతో మోసం..రూ. 17.50 లక్షలు తీసుకున్న దంపతులు..భార్య అరెస్ట్, పరారీలో భర్త

కోర్టు ఉద్యోగాల పేరుతో మోసం..రూ. 17.50 లక్షలు తీసుకున్న దంపతులు..భార్య అరెస్ట్, పరారీలో భర్త

నేరడిగొండ, వెలుగు : కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన దంపతులపై  ఆదిలాబాద్​జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదైంది. కేసుకు సంబంధించినిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.​ 

ఇచ్చోడ ఎస్‌‌హెచ్‌‌ఓ కె. నరేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఇచ్చోడ మండలం కామగిరి గ్రామానికి చెందిన నక్కల రమణారెడ్డి సోదరుడు రాజశేఖర్‌‌రెడ్డికి జీడిమెట్ల కు చెందిన ఉమ్మడి శంకర్ అనే వ్యక్తి పరిచయమై ఆయన కుమారులకు కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. 

ఇందుకు ఒక్కో ఉద్యోగం కోసం రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిజమేనని నమ్మిన రాజశేఖర్ రెడ్డి విడతల వారీగా రూ.18.50 లక్షలను శంకర్, అతడి భార్య లావణ్యకు చెందిన అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేశాడు. రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో రాజశేఖర్ రెడ్డి వారిని నిలదీశాడు. దీంతో ఉద్యోగాలు ఇప్పించలేకపోయామని, డబ్బులు పూర్తిగా వెనక్కి ఇస్తామని దంపతులు చెప్పారు. కానీ కేవలం రూ.  లక్ష మాత్రమే ఇచ్చి మిగిలిన డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్యను అదుపులోకి తీసుకోగా ప్రధాన నిందితుడు శంకర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.