భైంసాలో రోడ్డు ప్రమాదం.. బస్సు, ఆటో ఢీ.. నుజ్జునుజ్జు అయిన ఆటో

భైంసాలో రోడ్డు ప్రమాదం.. బస్సు, ఆటో ఢీ.. నుజ్జునుజ్జు అయిన ఆటో

భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఆటో ఢీ కొన్న ఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఆటో.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. 

ఈ ప్రమాదంలో ఆటో తీవ్రంగా ధ్వంసమవ్వగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ వద్ద ఘాట్‌‌‌‌ రోడ్డులో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి నలుగురు మహిళలు మృతిచెందారు. 42 మందికి గాయాలయ్యాయి. 

వారంతా ఓ వ్యక్తి అంత్యక్రియల కోసం వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి జిల్లా, పటాన్‌‌‌‌చెరు మండలం కేసారం గ్రామ సర్పంచ్ సమీప బంధువు శుక్రవారం మృతి చెందాడు. అతని అంత్యక్రియలు వికారాబాద్ జిల్లా, ధారూర్ మండలం చింతకుంట గ్రామంలో శనివారం నిర్వహిస్తున్నారు.

ఈ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కేసారం గ్రామానికి చెందినవారు ఓం నమ:శివాయ ట్రావెల్స్‌‌‌‌ బస్(ఏపీ03టీసీ 8295)లో చింతకుంట గ్రామానికి బయలుదేరారు. ఉదయం10 గంటల ప్రాంతంలో అనంతగిరి ఘాట్ రోడ్డులో వేగంగా వెళ్తున్న బస్సు మూలమలుపు వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో బీరగూడం పద్మమ్మ (50), పద్మమ్మ(55), యాదమ్మ(52) అనే ముగ్గురు స్పాట్‌‌‌‌లోనే చనిపోయారు. ప్రమీల(56) అనే మరో మహిళను అస్పత్రికి తరలించగా, ఆమె అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. మృతి చెందిన వారిలో ప్రమీల స్వస్థలం రంగారెడ్డి జిల్లా, శంకర్‌‌‌‌‌‌‌‌పల్లి మున్సిపాలిటీ సింగాపురం కాగా, మిగిలిన ముగ్గురు కేసారం గ్రామానికి చెందినవారు ఉన్నారు.