ఏసీబీకి చిక్కిన బీర్పూర్ ఆర్ఐ.. సాదాబైనామా క్రమబద్ధీకరణకు రూ. 40 వేలు డిమాండ్

ఏసీబీకి చిక్కిన బీర్పూర్ ఆర్ఐ.. సాదాబైనామా క్రమబద్ధీకరణకు రూ. 40 వేలు డిమాండ్
  • రూ. 30 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ

జగిత్యాల టౌన్, వెలుగు : సాదా బైనామా క్రమబద్ధీకరణకు లంచం తీసుకున్న జగిత్యాల జిల్లా బీర్పూర్ ఆర్ఐ రాహుల్ ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... సిరిపురం గ్రామానికి చెందిన ఓ మహిళ కొన్నేండ్ల కింద సాదా బైనామా ద్వారా 12 గుంటల భూమిని కొనుగోలు చేసింది. 

ఆ భూమిని క్రమబద్ధీకరించుకునేందుకు గతంలో 'ప్రజా పాలన' కార్యక్రమంలో అప్లై చేసుకుంది. ఈ అప్లికేషన్ పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ ఆర్ఐ రాజేశ్ ను ఆదేశించారు. ఈ క్రమంలో విచారణ కాస్త స్పీడ్ గా చేయాలని బాధితురాలు కోరగా.. పని పూర్తి చేసేందుకు రూ. 40 వేలు ఇవ్వాలని ఆర్ ఐ డిమాండ్ చేశారు. 

అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ. 30 వేలకు ఒప్పందం కుదిరింది. అనంతరం బాధితురాలు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసింది. వారి సూచనతో ఆర్ ఐకి డబ్బులు ఇచ్చేందుకు సిద్ధం కాగా.. అతడు గురువారం బాధితురాలి ఇంటికి వచ్చి డబ్బులు తీసుకున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఆర్ ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.