హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియా విస్తృతమవుతున్న నేపథ్యంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, వీటిని కట్టడి చేస్తామని హేట్ స్పీచ్ సెలెక్ట్ కమిటీ చైర్మన్, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించేందుకు కమిటీ స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందిస్తుందని తెలిపారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి పొన్నం అధ్యక్షతన సెలెక్ట్ కమిటీ రెండో సమావేశం జరిగింది.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్వేషపూరిత ప్రసంగాలతో శాంతిభద్రతలకే కాకుండా సామాజిక ఐక్యతకు కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు. హేట్ స్పీచ్‌ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. భావప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే.. ఒకరి స్వేచ్ఛ మరొకరి గౌరవం, భద్రత, సామాజిక సామరస్యానికి భంగం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలు, పోలీసు, ఇతర అధికార యంత్రాంగం దర్యాప్తులో ఎదుర్కొంటున్న సవాళ్లపై కమిటీలో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. సమావేశంలో కమిటీ సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, కోవ లక్ష్మి, మాణిక్‌రావు, అబ్దుల్ బలాల, అసెంబ్లీ, కౌన్సిల్ కార్యదర్శులు, హోంశాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
