గుడిహత్నూర్‌‌‌‌: పల్లెల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

గుడిహత్నూర్‌‌‌‌: పల్లెల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
  •     పిట్టబొంగరంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

గుడిహత్నూర్‌‌‌‌(ఇంద్రవెల్లి), వెలుగు: ఏజెన్సీ గ్రామాల రూపురేఖలు మార్చి, గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ఆరుసూత్రాల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆదిలాబాద్​కలెక్టర్‌‌‌‌ రాజర్షి షా, ఖానాపూర్‌‌‌‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. ఉట్నూర్​ఐటీడీఏ పీవో మకరందుతో కలిసి  శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని పిట్టబొంగరం, కేస్లాపూర్, శంకర్‌‌‌‌గూడ గ్రామాల్లో పర్యటించి జల సంరక్షణ పనులు, ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ సాగును పరిశీలించారు. పిట్టబొంగారంలో పీహెచ్‌‌‌‌సీ కాంపౌండ్‌‌‌‌ వాల్, కమ్యూనిటీ హాల్, గ్రామ పంచాయతీ భవనం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అర్హులైన వారు ఈ నెల 31వ తేదీలోగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మారుమూల పల్లెలకూ పట్టణ స్థాయి మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని బొజ్జు పటేల్‌‌‌‌ పేర్కొన్నారు. శంకర్‌‌‌‌ గూడలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ మొక్కలు నాటారు. ఆయా  కార్యక్రమాల్లో డీఆర్‌‌‌‌డీవో రవీందర్‌‌‌‌ రాథోడ్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్‌‌‌‌ సింగ్, ఉద్యాన అధికారి సందీప్‌‌‌‌ కుమార్, హౌజింగ్‌‌‌‌ పీడీ శంకర్, పిట్టబొంగరం సర్పంచ్‌‌‌‌ మాధవి తదితరులు పాల్గొన్నారు.