ఆదిలాబాద్ టౌన్, వెలుగు: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వారిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన మహ్మద్ ఖాజా మొయినుద్దీన్, గోరెమియా, షేక్ యాస్మిన్ సుల్తానా కలిసి మావల మండలం కైలాస్‌నగర్‌కు చెందిన చిట్టిపవార్ లావణ్య, ఆమె తమ్ముడు రాహుల్‌కు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు.
రూ.7 లక్షలు అడగ్గా బాధితులు రూ.3 లక్షలు చెల్లించారు. అనంతరం ఉద్యోగం గురించి అడగ్గా కాలయాపన చేయడంతో మోసమని గుర్తించిన బాధితులు మావల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొయినుద్దీన్, గోరెమియాను అరెస్ట్ చేయగా షేక్ యాస్మిన్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.
