తెలంగాణను వికాసం వైపు నడుపుతున్నం.. సంక్షేమం,అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు: CM రేవంత్

తెలంగాణను వికాసం వైపు నడుపుతున్నం.. సంక్షేమం,అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు: CM రేవంత్

హైదరాబాద్: తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని.. సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పెట్టేది ఖర్చుగా భావించడం లేదని.. ఓట్ల కోసం మెక్కుబడిగా హామీలు అమలు చేయడం లేదన్నారు. 32 నెలల కృషి ఇప్పుడు ఫలితాల్లో కనిపిస్తోందన్నారు. 80వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చారిత్రాత్మక గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఆర్బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ పురోగతిలో ఉందన్నారు. 

రైతులకు సంక్షేమం కోసం తమ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని.. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చాక లక్షా 70 వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం కేటాయించామని తెలిపారు. 2 లక్షల పంట రుణమాఫీతో 25 లక్షల మంది రైతు కుటుంబాలకు మేలు జరిగిందని.. కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు ఇచ్చామని చెప్పారు.  

సన్నవడ్లకు క్వింటాల్‎కు రూ.500 బోనస్ ఇచ్చామని తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. కోటీ మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కృషి చేస్తు్న్నామని చెప్పారు. మహాలక్ష్మీ స్కీంతో ఆడబిడ్డలకు అండగా ఉంటున్నామన్నారు. మహాలక్ష్మీ, గృహా లక్ష్మీ స్కీములతో ఆడబిడ్డలకు ఆసరా అయ్యామని అన్నారు.

పెట్రోల్ బంకులకు మహిళా సంఘాలను యజమానులను చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ ద్వారా సన్నం బియ్యం పంపిణీ పథకాన్ని విప్లవాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. 

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. కోర్ అర్బన్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టామని.. తద్వారా పట్టణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 2.25 లక్షల మందికి అసరా ఫించన్లు ఇస్తున్నామన్నారు. వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు కొత్తగా ఫించన్లు మంజూరు చేస్తున్నామన్నారు.