భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని కంపెనీ సీఎండీ బుద్ద ప్రకాశ్ జ్యోతి పేర్కొన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో శుక్రవారం ఆయన పర్యటించారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్లో ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన 1.2 మెగా వాట్ రూఫ్ టాప్ సోలార్ విద్యుత్‌తో సింగరేణికి రోజుకు దాదాపు రూ.48 వేల వరకు ఆదా అవుతోందన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఆఫీసులు, కాలనీల్లో రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను దశల వారీగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు సింగరేణి పెద్దపీట వేస్తోందన్నారు. అనంతరం హెడ్డాఫీస్‌లోని పాత, కొత్త బిల్డింగ్ లను పరిశీలించారు. ఈ ప్రోగ్రాంలో కంపెనీ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కొప్పుల వెంకటేశ్వర రావు, మోకాళ్ల తిరుమలరావు, శ్రీనివాసులు, అధికారులు, యూనియన్ నేతలు పాల్గొన్నారు.
