- ములుగు, పరకాలలో ఈ నెల 16 సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
- మేడారం నుంచి హ్యాం రోడ్ల పైలాన్ఆవిష్కరణ, ములుగులో కొత్త కలెక్టరేట్ ప్రారంభం
- హనుమకొండ జిల్లా పరకాలలో 100 పడకల ఆస్పత్రి, డిగ్రీ కాలేజ్భవనాలు ఓపెనింగ్
- ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే రేవూరి, ఆఫీసర్లు
ములుగు/ హనుమకొండ/ పరకాల, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 16న ములుగు, పరకాల ప్రాంతాల్లో పర్యటించనుండటంతో రెండు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. ములుగు జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రూ.16వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న హ్యాం రోడ్ల అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు.
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో పూర్తయిన వంద పడకల ఏరియా ఆస్పత్రి, డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఆయా జిల్లాల ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించారు.
మేడారం నుంచి పర్యటన..
సీఎం రేవంత్ రెడ్డి ములుగు పర్యటనను తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనంతో ప్రారంభించనున్నారు. అక్కడి నుంచే అర్హులైన ఒంటరి, వితంతు మహిళలకు కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ ఏడాది మేడారం మహాజాతరకు రూ.150 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల అనంతరం చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలపై కూడా సీఎం సమీక్షిస్తారు.
హ్యాం రోడ్లకు పైలాన్, కొత్త కలెక్టరేట్ ప్రారంభం..
ములుగు జిల్లా గట్టమ్మ సమీపంలో సీఎం రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మూడు విడతల్లో సుమారు రూ.16 వేల కోట్లతో చేపట్టనున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యాం) రోడ్ల అభివృద్ధి పనులకు పైలాన్ ఆవిష్కరించనున్నారు.
అనంతరం ములుగు నూతన కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అక్కడ నిర్వహించే సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
పరకాలలో 100 బెడ్ల ఆస్పత్రి..
హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రత్యేక కృషితో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మాణం పూర్తయిన వంద పడకల ఏరియా ఆస్పత్రి, డిగ్రీ కళాశాల భవనాలను ఆదివారం సీఎం ప్రారంభించనున్నారు.
దాదాపు 18 ఏండ్ల కింద మంజూరైన పరకాల డిగ్రీ కళాశాలకు ప్రత్యేక భవనం లేకపోవడంతో ఇన్నాళ్లూ జూనియర్ కళాశాల గదుల్లోనే తరగతులు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రేవూరి చొరవతో రూ.5 కోట్లతో కొత్త భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా పరకాల సివిల్ ఆస్పత్రికి పరిసర మండలాలతో పాటు భూపాలపల్లి, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు.
బెడ్ల కొరతను అధిగమించేందుకు రూ.35 కోట్లతో నిర్మించిన వంద పడకల ఏరియా ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. ఇందులో 14 సేవల్లో 12 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా పరకాలలో చలివాగుపై చెక్‌డ్యాం, మోడల్ బస్టాండ్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, ఏటీసీ సెంటర్ల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పట్టణంలోని పశువుల సంత మైదానంలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు..
సీఎం పర్యటన నేపథ్యంలో ములుగు, పరకాలలో ఆఫీసర్లు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం, గట్టమ్మ, కలెక్టరేట్ ప్రాంతాల్లో మిగిలిన పనులకు తుది మెరుగులు దిద్దుతున్నారు. పరకాలలో వర్షం వచ్చినా సభకు ఇబ్బంది కలగకుండా రెయిన్‌ప్రూఫ్ టెంట్లు, షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ములుగులో మంత్రి సీతక్క, కలెక్టర్ హేమంత్ సహదేవరావు, పోలీసు అధికారులు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్వివిధ శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు. పరకాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
