- ఎంజీఎం వద్ద బీఆర్‍ఎస్ నేతలు వాళ్లకువాళ్లే తన్నుకున్నరు
- మా కార్యకర్తలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే.. ఆడవాళ్లతో కొట్టిస్తా
- రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖ
వరంగల్, వెలుగు: వరంగల్‌లో నిర్మాణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరలో 8 ఫ్లోర్లతో ప్రారంభించనున్నట్లు మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆమె మంగళవారం వరంగల్ ఓ సిటీలోని క్యాంప్ ఆఫీస్‌లో రూ.61 లక్షల విలువైన 111 సీఎంఆర్‍ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ ప్రారంభించుకునే అవకాశం ఉందనే కారణంతోనే ఎంజీఎం పనుల కోసం నిధులు వృథా చేయలేదన్నారు. మంత్రి పదవి పోయినందుకు తనకు బాధ లేదని, ఆ పదవితో ఇన్నాళ్లు నియోజకవర్గానికి కొంత దూరమున్నానని.. ఇక నుంచి అందరికి దగ్గరుండే అవకాశం కలిగిందన్నారు. ఎంజీఎంలో నిరసన పేరుతో బీఆర్‍ఎస్ నేతలు వాళ్లకువాళ్లే తన్నుకుని హాస్పిటల్లో జాయిన్ అయ్యారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఎంజీఎంను ఎందుకు పట్టించుకోలేదో వారే చెప్పాలన్నారు.
వరంగల్ కలెక్టరేట్ నిర్మాణంలో కాంట్రాక్టర్‍కు కొంత బిల్లులు చెల్లించాల్సి ఉందని.. దీంతో ఫర్నీచర్ వర్క్ ఆపడంతో పనులు ఆలస్యమయ్యాయన్నారు. అవగాహన లేని బీజేపీ నేతలు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారన్నారు. వారికి చిత్తశుద్ది ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ ఆర్కియాలజీ పరిధిలో ఉండే ఖిలా వరంగల్ చుట్టూ 12 ఆలయాల అభివృద్ధి పనులకు అనుమతులు, నిధులు తీసుకురావాలన్నారు. సొంత పార్టీలోని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్‍పర్సన్ గుండు సుధారాణిని ఉద్దేశించి మాట్లాడుతూ.. కొందరు లీడర్లు గాలిలో కత్తులు తిప్పుతున్నారని ఫైర్ అయ్యారు. రెండ్రోజులు ఆగితే పదవి ఊసిపోయేది ఒకరైతే.. నిన్న గాక మొన్న పదవెక్కినోళ్లు మరొక్కరు ఉన్నారన్నారు. ఇకనుంచి ఎవరైనా ఇష్టారీతిన మాట్లాడితే ఆడోళ్లతో కొట్టిస్తామని హెచ్చరించారు.
