వరంగల్ఎయిర్పోర్టుకు.. దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి :తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం

వరంగల్ఎయిర్పోర్టుకు.. దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి :తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం
  • తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం సమావేశంలో వక్తల డిమాండ్​

పంజాగుట్ట, వెలుగు: వరంగల్​లోని మామునూరు విమానాశ్రయానికి తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని, ఆయన చరిత్రను భావి తరాలకు తెలిసేలా పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలని వక్తలు డిమాండ్​ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, వైద్యశాలలు, విద్యాసంస్థలకు  తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్లు పెట్టుకోవాలని సూచించారు. 

తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో  సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో మంగళవారం వరంగల్ మామునూరు ఎయిర్​పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలనే డిమాండ్​తో  రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్య వక్తలుగా ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్, ప్రొ. వినాయక్​ రెడ్డి, సీనియర జర్నలిస్టు పాశం యాదగిరి, కాంగ్రెస్​నాయకుడు అంబర్​పేట్ శ్రీనివాస్ యాదవ్, మాల మహానాడు నేతలు మందాల భాస్కర్, డా. పబ్బతి శ్రీకృష్ణ, బీఆర్ఎస్ నాయకురాలు తుల ఉమ, జర్నలిస్ట్ మర్రిపాల శ్రీనివాస్,  గంటె చంద్రయ్య, సైదా సికిందర్, కుందే వెంకటేశ్, యాదగిరి, దయ్యాల శ్రీనివాస్, కడమంచి రాంబాబు పాల్గొన్నారు. 

చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య, కొమురం భీంలాంటి త్యాగధనులను స్మరించుకుంటూ, వారి చరిత్రలను నిత్యనూతనంగా భవిష్యత్​ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాలపై ఉందన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏ నిర్మాణం చేపట్టినా తెలంగాణ త్యాగధనుల పేర్లను కచ్చితంగా పెట్టి గౌరవించుకోవాలన్నారు.  

సీఎం మాట మార్చొద్దు: కంచ ఐలయ్య

సీఎం గతంలో దొడ్డి కొమురయ్య పేరును పెడతామని మాట్లాడడం జరిగిందని ప్రొఫెసర్ కంచ ఐలయ్య  గుర్తు చేశారు. ఇచ్చిన మాటను మార్చిపోతే తెలంగాణ బహుజన ప్రజల ఆగ్రహానికి గురిగావాల్సి వస్తుందని హెచ్చరించారు. మామునూర్​ విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్యపేరును తెలంగాణలోని సబ్బండ వర్గాలు ప్రతిపాదిస్తున్నాయని, ప్రభుత్వం ఇతర వ్యాపకాల జోలికి వెళ్లకుండా ఆయన పేరు పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.