- కలెక్టర్ చిత్రామిశ్రా
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సన్నద్ధం కావాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రా సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ చిత్రామిశ్రా పాల్గొన్నారు. అనంతరం అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు.
ఆగస్టు 16 నుంచి 31వ తేదీ వరకు మొక్కజొన్న, ఉలవలు, అలసంద, పొద్దు తిరుగుడు, నువ్వులు, కూరగాయలు తదితర ఆరుతడి పంటలను సాగు చేసుకునేందుకు అనువైన సమయమని తెలిపారు. తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుపైనా దృష్టి పెట్టాలన్నారు. గతేడాది జిల్లాలో 6,130 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు కాగా, ఈ వానాకాలంలో ఇప్పటివరకు 19,135 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయడం శుభపరిణామమని అన్నారు.
