భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్ రాజు తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మే నెల నుంచి వరుస చైన్ స్నాచింగ్‌లు జరుగుతుండటంతో అశ్వారావుపేట, పాల్వంచ డీఎస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఈ క్రమంలో సున్నం నాగేంద్రబాబు, వల్లూరి శాంతరాజు, ఊకే భద్రం, బెత్తి కార్తీక్, ఊర లింగయ్య, బెత్తి ఆదిలక్ష్మి, కల్లూరి లావణ్య, అల్లం సారమ్మను అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో నిందితుడు తమ్మిశెట్టి బాల వీరస్వామి పరారీలో ఉన్నాడన్నారు. నిందితుల నుంచి రూ.26 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మూడు బైక్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు నాగేంద్రపై తెలంగాణ, ఏపీలో 83 దొంగతనం కేసులు ఉన్నాయని, ఇతర నిందితులపైనా పలు కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ప్రజలు వాకింగ్‌కు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాలు ధరించవద్దని, కాలనీలు, బస్తీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ముఠాను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసు అధికారులను అభినందించారు.
