80 ఏండ్లయినా దేశంలో కుల వివక్ష పోలే..దళితులను అవమానిస్తున్న బీజేపీ

80 ఏండ్లయినా దేశంలో కుల వివక్ష పోలే..దళితులను అవమానిస్తున్న బీజేపీ
  •     ఖర్గే ప్రసంగించిన సభా వేదికను శుద్ధి చేయడం పట్ల కాంగ్రెస్​ ఫైర్
  •     నిరసనలు, పాదయాత్రలు, సత్యాగ్రహ దీక్షలతో ఖండన

వేములవాడ/కరీంనగర్/కోల్​బెల్ట్/జగిత్యాల టౌన్, వెలుగు: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన సభా వేదికను శుద్ధి పేరుతో హవనం చేయడం కుల వివక్షకు, సామాజిక విభజనకు అద్దంపడుతోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఉత్తరాఖండ్‌‌‌‌లోని హల్ద్వానీ రాంలీలా మైదానంలో జరిగిన ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హల్ద్వానీలోని రాంలీలా మైదానంలో ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన విజయ్ శంఖనాద్ సభలో మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన రెండ్రోజుల తర్వాత శ్రీరామ్ సేనకు చెందిన కార్యకర్తలు ఆ వేదికను శుద్ధీకరణ చేయడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. కులం ఆధారంగా ఒక వ్యక్తిని అపవిత్రంగా భావించడం ఏ విధమైన సామాజిక న్యాయమని ప్రశ్నిం చారు. బీజేపీ, దాని అనుబంధ సంస్థలు కులం, మతం పేరుతో ప్రజలను విభజించే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

దళితులందరికి అవమానమే 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏండ్లు గడిచినా కుల వివక్ష పోలేదని చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. హల్ద్వానీలో జరిగిన ఘటన ఖర్గేకు మాత్రమే అవమానం కాదని, దళిత బహుజనులందరినీ అవమానించినట్లేనని మండిపడ్డారు. కరీంనగర్​లోని కిసాన్ నగర్ మహాత్మా గాంధీ విగ్రహం నుంచి కోర్ట్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్​నేతలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ.. 2014 నుంచి దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కార్ దళిత, బహుజనులను అడుగడుగునా అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరసయ్య, కాంగ్రెస్ నేతలు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి,  అంజనీ ప్రసాద్, మల్లికార్జున రాజేందర్ పాల్గొన్నారు. 

వెంటనే అరెస్ట్​ చేయాలి

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం చిర్రకుంటలో డీసీసీ ప్రెసిడెంట్​రఘునాథ్ ​రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్​విగ్రహం ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మల్లికార్జున ఖర్గే పాల్గొన్న వేదికను శుద్ధీకరణ పూజలు చేసిన వారిపై అంటరానితనం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని రఘునాథ్ ​రెడ్డి​ డిమాండ్​ చేశారు. బ్లాక్​ కాంగ్రెస్​ మాజీ ప్రెసిడెంట్​గందె రాంచందర్, పార్టీ మండల జనరల్ ​సెక్రటరీలు, పలు గ్రామాల సర్పంచులు, లీడర్లు​ పాల్గొన్నారు. జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో సత్యాగ్రహ నిరసన, పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.