స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చర్చనీయాంశమైంది. ఎర్రకోటపై జరిగిన వేడుకల్లో ప్రధాని యువత కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్, AI ట్రైనింగ్ స్కీమ్స్ ప్రకటించారు. ఈ ప్రకటనపై ప్రముఖ ఎంటెక్ ప్లాట్‌ఫారమ్ ఫిజిక్స్ వాలా ఫౌండర్ అలఖ్ పాండే సానుకూలంగా స్పందించారు.
మోడీ ప్రకటనను హర్షిస్తూ అలఖ్ పాండే ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. మారుమూల గ్రామాలు, చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అత్యంత కీలకమని తాను ఎప్పుడూ నమ్ముతానని చెప్పారు పాండే. పేద విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తామన్న ప్రధాని హామీ అభినందనీయమన్నారు.
I really appreciate Hon'ble Prime Minister's Promise about Free online Coaching for all needy students. I have always believed that online is the only way to make quality education accessible to remote towns and villages. I want to see this happening on ground coz execution is…
— Alakh Pandey (PhysicsWallah) (@PhysicswallahAP) August 15, 2026
ఈ అద్భుతమైన స్కీమ్ అమలులో క్షేత్రస్థాయిలో సరైన ఇంప్లిమెంటేషన్ ఉండాలని అలఖ్ పాండే అభిప్రాయపడ్డారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా.. ఆచరణలో ఇది విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ పథకానికి తనవంతు ఫుల్ సపోర్ట్ ఉంటుందని.. ప్రభుత్వానికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా బేషరతుగా సహాయం చేస్తామని స్పష్టం చేశారు.
దేశంలోని ప్రతి బిడ్డకు ఉచితంగా నాణ్యమైన విద్య అందాలనేదే తన ముఖ్య ఉద్దేశమని అలఖ్ పాండే వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా మోడీ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఇది మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలపై కోచింగ్ భారాన్ని తగ్గిస్తుందని తెలిపారు. ప్రధాని ప్రకటించిన డిజిటల్ విద్య, AI శిక్షణ కార్యక్రమాలు 'వికసిత్ భారత్ 2047' సాధనకు యువ శక్తిని ఎంతగానో బలోపేతం చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు.
