తెలంగాణలో ఆ 16 రోడ్లు.. అభివృద్ధికి దూరం.. పదేండ్లుగా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం

తెలంగాణలో ఆ 16 రోడ్లు..  అభివృద్ధికి దూరం.. పదేండ్లుగా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
  • నేషనల్ హైవేల కింద అభివృద్ధి చేయాలని 
  • గతంలోనే కేంద్రానికి ప్రపోజల్స్
  • తాజాగా హ్యామ్ ప్రాజెక్టులోనూ చేర్చని రాష్ట్రం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పలు జిల్లాలను కలుపుతూ, పారిశ్రామిక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు, అంతర్రాష్ట్ర సరిహద్దులను అనుసంధానం చేస్తున్న 16 రోడ్లు అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉండిపోయాయి. 1,617 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారుల కింద అభివృద్ధి చేయాలని 2015–-16 లోనే అప్పటి ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. పదేండ్లు దాటినా రోడ్ల అభివృద్ధిపై కేంద్రం స్పందించడం లేదు. 

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హ్యామ్ రోడ్ల ప్రాజెక్టులోనూ ఈ రోడ్లు లేకపోవడంతో జనం పరేషాన్ అవుతున్నారు. వ్యాపారం, పర్యాటకం, రైతుల సరుకు రవాణాకు కీలకమైన రోడ్లు ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. 

జాతీయ రహదారుల కింద అభివృద్ధికి ప్రతిపాదనలు

రాష్ట్రంలో కీలకమైన 16 స్టేట్​హైవేస్​ను జాతీయ రహదారులుగా గుర్తించి నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని పదేండ్ల కింద ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఇందులో తెలంగాణ–కర్నాటక రాష్ట్రాలను కలిపే మూడు అతి ముఖ్యమైన రోడ్లు సైతం ఉన్నాయి. వీటిలో కొన్ని సింగిల్ లేన్, మరికొన్ని డబుల్​లేన్ రోడ్లు కాగా, అన్నీ పారిశ్రామిక ప్రాంతాలు, పర్యాటక స్థలాలు, అంతరాష్ట్ర కనెక్షన్లు, జిల్లా కేంద్రాలను కలిపేవే కావడం గమనార్హం. రాష్ట్రం పంపిన ప్రపోజల్స్ ఫైల్ పదేండ్లుగా కేంద్రం వద్దే పెండింగ్ లో ఉంది. 

రాష్ట్రంలో కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ఆర్​అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ 16 రోడ్లను నేషనల్​హైవేస్​గా అభివృద్ధి చేయాలని కోరారు. గతంలో సాధారణ రాష్ట్ర రహదారులుగా ఉన్న ఈ రోడ్లు.. కాలక్రమేణ ట్రాఫిక్ పెరగడంతో ఇరుకుగా మారాయని కేంద్ర మంత్రికి  వివరించారు.  

హ్యామ్ ప్రాజెక్టులోనూ కనిపించని రోడ్లు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైబ్రిడ్​అన్యూటీ మోడల్ (హ్యామ్​) కింద ఆర్అండ్​బీ రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.19,300 కోట్లతో 13,541 కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తోంది. ఆర్అండ్ బీ శాఖ తరఫున 441 రోడ్లు, పంచాయతీరాజ్ తరపున 2,162 రోడ్లను టేకప్​చేసింది. ఈ ప్రాజెక్ట్​లో కేంద్రానికి పంపిన ఆ 16 రోడ్లు లేవని హ్యామ్​ ప్రాజెక్ట్​చీఫ్​ఇంజినీర్​వెంకటేశ్వర్​రావు ‘వీ6 వెలుగు’తో తెలిపారు. ఆ రోడ్లను కేంద్ర నిధులతో బాగు చేయాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు వివరించారు. 

తెలంగాణ, -కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ 67 కిలోమీటర్లు ఉన్న ఎర్రవెల్లి క్రాస్‌‌ రోడ్ – రాయచూర్ రోడ్డు ఇరుకుగా,  గుంతలు, మలుపులతో ఉండడడంతో ప్రమాదాలకు కేరాఫ్ గా మారింది. ఈ రోడ్డుపై 2024 సెప్టెంబర్ లో బస్సు ప్రమాదం జరిగి ఇద్దరు స్టూడెంట్లు చనిపోగా, 40 మందికి గాయాలయ్యాయి. 

భూపాలపల్లి జిల్లా కాటారం– జగిత్యాలను కలిపే రోడ్డు 130 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాటారం నుంచి మంథని వరకు ఇసుక లారీలు తిరగడం వల్ల రోడ్డు పూర్తిగా డ్యామేజీ అయింది. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే నరకం కనిపిస్తుందని శుక్రవారం కాటారం వద్ద ప్రజలు భారీ ధర్నా నిర్వహించారు. వెంటనే ఈ రోడ్డును బాగు చేయాలని కోరారు.