భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమర యోధులందరికీ నివాళి అర్పిస్తున్నాను. గతవారం అండమాన్, నికోబార్ దీవుల్లో పర్యటించినప్పుడు హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసే గౌరవం నాకు లభించింది.
అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భాన్ని స్మరించుకొని నివాళి అర్పించాను. నేతాజీ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ 1943 డిసెంబర్ 30న భారత భూభాగంపై తొలిసారి మువ్వన్నెల జెండాను ఎగురవేసిన పవిత్ర భూమిపై నిలబడటం నా హృదయాన్ని కదిలించే అనుభవం. పసుంపోన్ ముత్తురామలింగ థేవార్ ఆహ్వానం మేరకు 1939 సెప్టెంబర్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మధురైని సందర్శించిన విషయాన్ని ఈ సందర్భం నాకు గుర్తు చేసింది. ఆ ప్రాంతంలోని అనేకమంది దేశభక్తుల్లో ఈ చారిత్రక ఘట్టం స్ఫూర్తిని రగిలించింది.
జాతీయ స్మారకమైన సెల్యూలార్ జైలును సందర్శించడం కూడా నా పర్యటనలో మరో స్ఫూర్తిదాయకమైన సందర్భం. వీర్ సావర్కర్, యోగేంద్ర శుక్లా, బతుకేశ్వర్ దత్, సచ్ఛీంద్రనాథ్ సన్యాల్‌తో సహా ఎందరో భారతమాత వీరపుత్రులను వలసవాద శక్తులు ఇక్కడ బంధించాయి. ఏకాంత కారాగారవాసాన్ని విధించాయి.
స్వేచ్ఛగా, గౌరవంగా భారత్ మనుగడ సాగించాలనే లక్ష్యంతో ప్రాణాలర్పించినవారి ధైర్యాన్నీ, వేదననూ, మహోన్నత త్యాగాల గాథలు.. నేటికీ ఈ జాతీయ స్మారకం గోడలు ప్రతిధ్వనిస్తున్నాయి. లక్షలాది ప్రజల్లో దేశభక్తి జ్వాలను రగలించి దేశాన్ని స్వాతంత్ర్యం దిశగా నడిపించిన
మార్గదర్శకులందరికీ నివాళిగా ఈ వ్యాసం రాయడానికి ఈ సందర్శనే నాకు స్ఫూర్తినిచ్చింది.
క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ...
ఆగస్టు 9న అండమాన్ దీవుల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. జాతిపిత మహాత్మాగాంధీ 1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించి ‘డూ ఆర్ డై’ అనే స్ఫూర్తిదాయక నినాదాన్ని ఇచ్చారు. ఈ పిలుపుతో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యం సాధించాలనే ఆకాంక్ష తీవ్రమయింది. తమ కాలంలో వలసవాద శక్తులతో పోరాడిన తరానికి ధన్యవాదాలు. వారి కారణంగానే ఇప్పుడు మనం స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ హక్కులతో జీవించే అదృష్టాన్ని పొందాం. భారత్‌మాతకు స్వేచ్ఛను అందించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది స్వాతంత్ర్య సమర యోధులు చెక్కుచెదరని సంకల్పంతో పోరాడారు. ఎన్నో త్యాగాలు చేశారు. అనేకమంది తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారు.
స్వాతంత్య్ర సమర యోధుల ఘనచరిత్ర
ఉత్తరాన కాశ్మీర్, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన గుజరాత్, తూర్పున అస్సాం... ఇలా అన్ని ప్రాంతాలకూ, నేపథ్యాలకూ, వయసులకూ చెందిన స్వాతంత్ర్య సమరయోధులు, ధీరవనితలూ ఒకే ఉమ్మడి లక్ష్యం కోసం ఏకమయ్యారు. అదే భారతమాతకు స్వాతంత్ర్యం. మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాటానికి శాశ్వత ప్రతీకగా నిలిచిన ఝాన్సీరాణి లక్ష్మీబాయి శౌర్యం, మంగళ్ పాండే ధైర్యం, ‘స్వరాజ్యం నా జన్మహక్కు, నేను దానిని సాధిస్తాను’ అనే నినాదంతో దేశాన్ని జాగృతం చేసిన బాలగంగాధర తిలక్ నిర్భయ పిలుపు... ఇలా ప్రతి స్వరం స్వాతంత్ర్యం దిశగా చేపట్టిన ప్రయాణాన్ని బలోపేతం చేసింది.
తొలి స్వదేశీ నౌకారవాణా సంస్థను ప్రారంభించి వలస పాలన ఆర్థిక ఆధిపత్యాన్ని వీవో చిదంబరం సవాలు చేశారు. యుద్ధభూమిలో మాత్రమే కాకుండా.. వాణిజ్య రంగంలోనూ స్వాతంత్ర్య పోరాటం సాగిందని ఆయన నిరూపించారు. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల విప్లవ కాంక్ష... స్వేచ్ఛా సాధనకు త్యాగం చేసేలా తరతరాలకూ స్ఫూర్తిగా నిలిచింది. ఈశాన్యంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటన జ్వాలను రాణి గైడిన్ లియు రగిలించారు.
అస్సాంలో అచంచలమైన ధైర్యంతో జాతీయ పతాకాన్ని మోస్తూ, క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ కనకలతా బారువా అనే యువతి ప్రాణాలను అర్పించారు. భగవాన్ బిర్సా ముండా, అనేకమంది ఇతర గిరిజన నాయకులు వలస పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన చారిత్రక పోరాటానికి నాయకత్వం వహించారు.
మన చరిత్ర పుటల్లో పోరాట పటిమనూ, ధైర్యాన్నీ, పట్టుదలనూ ప్రదర్శించే అనేక గాథలున్నాయి. అవన్నీ కలసి ధైర్యాన్నీ, సాహసాన్నీ తనలో ఇముడ్చుకున్న గొప్ప చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. తరతరాలకూ స్ఫూర్తిగా నిలిచిన అసంఖ్యాకమైన వీరుల సమష్టి సంకల్పంతోనే భారతదేశ స్వాతంత్ర్యం సాధ్యమైందని మనకు గుర్తు చేస్తాయి.
వందేమాతరం
1932 జనవరి 10న జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో కుమరన్ ఓ యాత్రకు నాయకత్వం వహించారు. చేతిలో జాతీయవాద పతాకాన్ని పట్టుకొని, మరికొందరు ధైర్యవంతులతో కలిసి చేపట్టిన ఆ యాత్రలో ‘వందేమాతరం’ నినాదాలతో తిరుప్పూర్ వీధులు ప్రతిధ్వనించాయి. ఈ బృందంపై వలసవాద శక్తులు దాడి చేశాయి.
ఈ దాడిలో తలకు గాయమైన కుమరన్ వందేమాతరం అని నినదిస్తూ.. జెండాను శరీరానికి హత్తుకొని దేశం కోసం ప్రాణాలర్పించారు. మరణించే నాటికి ఆయన వయసు కేవలం 27 ఏళ్లు. తిరుప్పూర్ కుమరన్ వయసు గురించి రాస్తున్నప్పుడు, మాతృభూమి కోసం తమ ప్రాణాలను అర్పించిన ఎందరో యువకులు గుర్తుకు వస్తున్నారు. భగత్ సింగ్ (23), సుఖ్‌దేవ్ (23), రాజ్‌గురు (22), ఖుదీరామ్ బోస్ (18), కనకలతా బారువా (18), అనంత లక్ష్మణ్ కన్హేరే (19), వంచినాథన్ (25) లాంటి ఎందరో యువకులు తమ ప్రాణాలను త్యాగం చేసి, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అమరులయ్యారు.
స్వాతంత్ర్య సంగ్రామంలో అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవను ప్రశంసిస్తున్నాను. సుప్రసిద్ధమైన, అజ్ఞాత స్వాతంత్ర్య సమర యోధులకు నివాళులు అర్పిస్తున్నాను. ఈ మహత్తర సందర్భంలో, మన మాతృభూమి పట్ల మన మన బాధ్యతను సమీక్షించుకొని, నవీకరించుకుందాం. ఈ అమృత కాలంలో 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడానికి మనల్ని మనం అంకితం చేసుకుందాం.
మన దేశ పురోగతి, శ్రేయస్సు కోసం కలిసికట్టుగా కృషి చేద్దాం. అచంచలమైన ధైర్యంతో పోరాడి, మన స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులకు మనం అర్పించగల అత్యంత సముచితమైన నివాళి ఇదే. జై హింద్! భారత్ మాతాకీ జై!
స్వాతంత్య్ర ఉద్యమంలో తిరుప్పూర్
మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న నేపథ్యంలో కోడికాథ కుమరన్ (పతాక రక్షకుడు కుమరన్)గా ప్రసిద్ధి చెందిన తిరుప్పూర్ కుమరన్‌కు నివాళి అర్పిస్తున్నా. నా స్వస్థలమైన తిరుప్పూర్‌లో, స్వాతంత్ర్య పోరాట సమయంలో జాతీయ పతాకాన్ని కింద పడనీయకుండా పట్టుకొని మృత్యుఒడిలోకి చేరారు. అందుకే ఆయనకు ఈ బిరుదు లభించింది. చిన్న వయసులోనే కుమరన్ మనసులో దేశభక్తి
జ్వాల ప్రజ్వరిల్లింది. ‘స్వరాజ్యం మన జన్మహక్కు’ అనే పిలుపుతో ఆయన స్వాతంత్ర్య పోరాటంలో
చేరారు.
మహాత్మాగాంధీ ఆదర్శాలతో ప్రభావితమైన కుమరన్ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో
జాతీయవాద స్ఫూర్తిని మేల్కొలపడానికి ‘దేశబంధు యూత్ అసోసియేషన్’ను ప్రారంభించారు.
వలసవాద పాలనలో అన్యాయాల పట్ల ప్రజలు చైతన్యవంతులైనప్పుడే, వలస పాలకులను ఎదుర్కొనే ధైర్యాన్ని, స్పష్టతను పెంపొందించుకున్నప్పుడే అసలైన స్వేచ్ఛ సాధ్యమవుతుందని కుమరన్ దృఢంగా విశ్వసించారు.
గాంధీజీ బోధించిన సామాజిక సంస్కరణలకు కట్టుబడి, సామాజిక, జాతీయ పునరుజ్జీవనానికి ఆవశ్యకమైనదిగా భావిస్తూ.. మద్యపాన నిషేధాన్ని ప్రచారం చేశారు. దీనిలో భాగంగా మద్యపానాన్ని విడిచిపెట్టి ఆత్మనియంత్రణను అలవర్చుకోవాలని ప్రోత్సహించారు.
- సీపీ రాధాకృష్ణన్ భారత ఉప రాష్ట్రపతి
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
