భారతదేశంలో ఎన్నికలు నిర్వహించేందుకు స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటుచేసిన సంస్థ భారత ఎన్నికల సంఘం. దేశంలో పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించే స్వయంప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ.
ఓటర్ల జాబితా తయారీ, సవరణ ప్రక్రియ, పర్యవేక్షణ, రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్, ఎన్నికల గుర్తులు కేటాయింపులు ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యతలు. అయితే ఇటీవల కాలంలో ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలపై అనేక అనుమానాలు వస్తున్నాయి.
పారదర్శకంగా, నిష్పక్షపాతంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన భారత ఎన్నికల సంఘానికి మకిలి అంటింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి అప్రజాస్వామిక నిర్ణయాలతో రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కును కూడా నిర్దాక్షిణ్యంగా చోరీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే తోటి కమిషనర్ల విశ్వాసాన్ని కోల్పోయిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాన ప్రతిపక్షాలతోపాటు అధిక సంఖ్యలో దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈసీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికలను పర్యవేక్షించే వ్యవస్థ ఇక ఎంతమాత్రం జ్ఞానేశ్‌కుమార్ చేతుల్లో ఉండరాదని ప్రతిపక్షాలు గట్టిగా కోరుకుంటున్నాయి.. తక్షణం పదవి నుంచి తప్పుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. వారు కోరుతున్నట్టుగా జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసినా ఎన్నికల సంఘం స్వతంత్రతను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.
సీఈసీని తొలగించాలి
సర్ ప్రక్రియను నిలిపివేయాలి!
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాల
నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఒక్క క్షణం కూడా ఆయన ఆ పదవిలో కొనసాగటానికి వీల్లేదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన పరిశోధనాత్మక కథనం ప్రకారం.. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సందు, వివేక్ జోషి గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో.. ఓటర్ల నమోదు, ఓట్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపు, ఎన్నికల డేటా కమిషన్ పనితీరుకు సంబంధించిన నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది ఏ రాజ్యాంగ సంస్థకైనా తీవ్రమైన పరిణామం.
ముఖ్యంగా దేశాన్ని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను నిర్వహించే బాధ్యత కలిగిన సంస్థ విషయంలో దీనిని తేలికగా తీసుకోలేం. కానీ, ఎన్నికల సంఘం మాత్రం తన పనితీరును సమర్థించుకుంది. నిర్ణయ ప్రక్రియలో భిన్నాభిప్రాయాలు, లిఖితపూర్వక అభిప్రాయాలు, అంతర్గత పరిశీలనలు సహజమేనని, చివరకు నిర్ణయాలు నిర్దేశిత విధానాల ప్రకారమే తీసుకున్నామని తెలిపింది. అయితే అసలు సమస్య ఈసీ పారదర్శకత, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ( సర్ ) నేపథ్యంలో ఈ వివాదం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివాదాస్పదంగా ఓటర్లను తొలగించే ప్రక్రియ
అత్యంత వివాదాస్పదమైన సర్ ప్రక్రియకు సీఈసీ శ్రీకారం చుట్టారు. రాజ్యాంగ ఆశయాన్ని తుంగలో తొక్కి వీలైనంత మందిని ఓటుకు దూరంచేసే అప్రజాస్వామిక విధానం ఆయన హయాంలో జరుగుతున్నది. ఇప్పటికే 13 కోట్ల మంది తమ ఓటు హక్కును కోల్పోయారు.
ఈసీ అసమంజస విధానాల వల్ల ఓటు హక్కు కోల్పోతున్నవారిలో ప్రధానంగా మైనార్టీలు, పేదలు, వలస కార్మికులు ఉంటున్నారు. అధికారంలో ఉన్న కూటమికి మేలు జరిగేలా సర్ ప్రక్రియను అమలు చేస్తున్నారనడంలో సందేహం లేదు. పాలక పార్టీకి తొత్తుగా మారి ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాల్సిందే అనే డిమాండు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నది.
ఓటర్ల జాబితాలో.. మరణించినవారి పేర్లు, వేరే ప్రాంతాలకు తరలిపోయివారు, అనర్హులు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదైన వారి పేర్లు తొలగించి జాబితాలను ప్రక్షాళన చేయడాన్ని ఎవరూ తిరస్కరించలేరు.
కానీ అసలు ప్రశ్న ఈ ప్రక్షాళన ఎంత పారదర్శకంగా జరుగుతుంది? అన్నదే. సర్ ప్రక్రియలు దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 13 కోట్లకు పైగా పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ఈ తొలగింపులో చాలావరకు నిబంధనల ప్రకారం జరిగి ఉండవచ్చు. కానీ ఇంత భారీస్థాయిలో పేర్లు తొలగించిన్నప్పుడు ప్రతి అర్హుడైన ఓటరుకు ధ్రువీకరణ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం, అప్పీలు చేసుకునే సులభమైన విధానం ఉండటం అత్యవసరం.
ఈసీ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలి
అసలు ఆందోళన ఏమిటంటే.. ఆ అభ్యంతరాలను ఎలా పరిగణించారు? వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ప్రజలకు దాని గురించి ఎంతవరకు సమాచారం అందుతుంది? కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6 విధానంలో మార్పులు, పశ్చిమ బెంగాల్లో అప్పీల్ ప్రక్రియ వంటి అంశాలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఇలాంటి విషయాల్లో రాజకీయ ఆరోపణలు కాకుండా స్పష్టమైన నియమాలు, ఆధారాలు, పత్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి.
ఎన్నికల జాబితాలను అధికార పార్టీకి అనుకూలంగా మార్చుతున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ ఎన్నికల సంఘం ఆరోపణలను ఖండిస్తున్నాయి. వాటికి ఆధారాలు అవసరం. ఎన్నికల సంఘం విశ్వసనీయత కేవలం ఎన్నికలను సకాలంలో నిర్వహించడంలో లేదు.
ప్రజలు ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా విశ్వసించడంలో ఉంది. అందుకే ప్రస్తుత విధానాన్ని మరో రాజకీయ ఘర్షణగా చూడకుండా సంస్థాగత పారదర్శకతను పెంచుకునే అవకాశంగా ఎన్నికల సంఘం చూడాలి. ప్రధానంగా ఎన్నికల కమిషన్ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలి.
అంతర్గతంగా లేవనెత్తిన అభ్యంతరాలపై సాధ్యమైనంత వరకు పత్రాలు, విధానాలు, నిర్ణయాల వివరాలను ప్రజలకు ఈసీ వెల్లడించాలి. ఓటర్ల డేటా బేస్ భద్రత, పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు, అప్పీల్ ప్రక్రియలపై స్పష్టమైన జవాబులు ఇవ్వాలి. పారదర్శకమైన విధానాలు, చట్టబద్ధమైన నిర్ణయాలు స్వతంత్రంగా ఉండాలి.
దేశవ్యాప్తంగా సీఈసీపై నిరసనలు
ఈ క్రమంలో తక్షణం సీఈసీ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. సీఈసీ పదవికి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు ఊరుకోబోమని ఇప్పటికే సీజేపీతో పాటు పలువురు హెచ్చరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు హైదరాబాద్‌లో, వివిధ రాష్ట్ర రాజధానులలోనూ ఇదే అంశంపై సమావేశాలు, సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు కొనసాగుతున్నాయి.
అధికార పక్షం కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 28న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. ఇదే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సెప్టెంబర్ 30న సీఈవో వద్ద ఆందోళనకు వామపక్షాలు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు పిలుపునిచ్చారు. అక్టోబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని వారు హెచ్చరించారు.
- ఉజ్జిని రత్నాకర్ రావు ,సీపీఐ సీనియర్ లీడర్
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
